ArticlesNews

భారతదేశపు మొదటి స్వదేశీ స్వాతంత్య్ర సమరయోధుడు

24views

‘‘‌జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’’ అంటే కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే మిన్న అని అర్థం. ఇది వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ధ శ్లోకం. రావణ సంహారం తరువాత బంగారు లంకను చూసి లక్ష్మణుడు మోహితుడైనప్పుడు, శ్రీరాముడు లక్ష్మణునితో అన్నమాట ఇది. మాతృ ప్రేమ, దేశభక్తి గొప్పతనాన్ని ఈ సూక్తి వివరిస్తుంది. ‘‘భారతం వందే జగద్గురుం’’. జగద్గురువైన భారతమాతకు వందనములు. ఈ మట్టిలో పుట్టిన ప్రతీ అణువు పూజనీయమే. అందుకే ఉదయం లేవగానే మన పాదం ఈ నేలపై పెడుతూ నేలతల్లీ నీకు వందనం. నా పాదం నీకు తగిలినందుకు క్షమించమని అడుగుతాం. ‘‘సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే! విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే! అని ఈ శ్లోకం పఠిస్తాము. నేను గుప్పెడు మట్టే కావచ్చు కాని తల ఎత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అంటారు శేషేంద్ర. ఈ మట్టి విలువ తెలిసినవాడు కాబట్టి.

‌ప్రపంచంలో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అగ్రగామి రాజ్యంగా ఎదిగింది. ఆర్థ్ధికంగానే కాక సైనికపరంగా కూడా శక్తిమంతమైన దేశంగా అవతరించింది, అయినప్పటికీ వియత్నాం అనే చిన్నదేశం చేతిలో ఓడిపోయింది. మార్చి 29, 1973న అమెరికా సైన్యం వియత్నాం నుండి వైదొలిగింది. అమెరికాపై సాధించిన విజయం తరువాత వియత్నాం అధ్యక్షుడిని ఓ విలేకరి ప్రశ్నిస్తూ మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికి అంతుచిక్కడం లేదు అన్నాడు. దానికి వియత్నాం అధ్యక్షుడు చెప్పిన సమాధానం ఏమంటే శక్తిమంత మైన అమెరికాను ఓడించడానికి నేను గొప్ప దేశభక్తి గల భారతీయ రాజు చరిత్ర చదివాను. అతని జీవితం నుండి ప్రేరణ పొంది యుద్ధ నీతి, ప్రయోగా లతో విజయం సాధించాను అని అన్నాడు. ఎవరా భారతీయ రాజు? అని విలేఖరి తిరిగి ప్రశ్నించాడు, వెంటనే వియత్నం అధ్యక్షుడు లేచి నిలబడి కృతజ్ఞతా పూర్వకంగా రాజస్థాన్‌లోని మేహర్‌ ‌వీరుడు రాణా ప్రతాప్‌ ‌సింగ్‌ అని సగర్వంగా  ప్రకటించాడు. రాణా ప్రతాప్‌ ‌పేరు చెప్పినప్పుడు ఆయన కళ్ళలో వీరత్వం తొణికిసలాడింది. అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించే వారమని అన్నాడు. కొన్నాళ్ల తరువాత వియత్నాం రాజు మరణించాడు. ఆయన సమాధి మీద ఇది రాణా ప్రతాప్‌ ‌శిష్యుడి సమాధి అని రాశారు.

కొన్ని సంవత్సరాల తరువాత వియత్నాం విదేశాంగ మంత్రి భారత్‌ ‌పర్యాటనకు వచ్చారు. వచ్చినవారు భారత్‌లోని గొప్ప వీరులకు శ్రద్ధాంజలి ఘటించడం ఆనవాయితీ. దానిలో మొదట గాంధీజీ సమాధి చూపారు. తరువాత ఎర్రకోట ఇలా వరుసలో చూపించేటప్పుడు వియత్నాం మంత్రి మహారాణా ప్రతాప్‌ ‌సమాధి ఎక్కడని ప్రశ్నించారు. అప్పుడా గైడ్‌ ఆయన సమాధి ఉదయ్‌పూర్‌లో ఉందని చెప్పగా, అక్కడకు వెళ్లి, సమాధిని దర్శించి, అక్కడ నుండి పిడికెడు మట్టి తీసుకుని తన బ్యాగ్‌లో వేసుకున్నాడు. ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులకు జన్మనిచ్చింది. అందుకే దీన్ని తీసుకువెళ్లి, మా దేశం మట్టిలో కలిపితే ఈ మహానీయుని ప్రేరణతో అక్కడ కూడా ఎందరో దేశభక్తులు ఉదయిస్తారు. మహారాణా ఈ దేశమే కాదు, ప్రపంచం గర్వించదగ్గ రాజని ఆ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు.

ఓ సందర్భంలో భారత్‌ ‌పర్యటన కోసం అబ్రహాం లింకన్‌ ‌సిద్ధమౌతుండగా ఆయన తల్లిని అడిగాడట, నీ కోసం భారత్‌ ‌నుండి ఏమి తీసుకురావాలని. దానికి ఆమె రాజస్థాన్‌లో మేవార్‌ ‌నుండి పిడికెడు మట్టిని తీసుకురమ్మన్నదట. అక్కడ రాజు ఎంతట విశ్వాసపాత్రుడుగా ఉండేవాడంటే తనకు సహకరిస్తే సగం రాజ్యం ఇస్తానని శత్రురాజు ప్రలోభ పెట్టినా తన మాతృభూమే కోరుకున్నాడు గాని స్వార్థ్ధంతో రాజ్యాన్ని కోల్పోలేదు అని చెప్పిందట. అయితే కొన్ని కారణాల వలన అబ్రహం లింకన్‌ ‌భారత్‌ ‌ప్రయాణం రద్దయింది. ఈ విషయాన్ని ది బుక్‌ ఆఫ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌యు.ఎస్‌.ఎ.‌లో పేర్కొన్నాడు.

మహారాణా ప్రతాప్‌ ‌దేశభక్తి, త్యాగం, పోరాటా నికి ప్రతీకగా మారినందున భారతీయులకు గౌరవం, గర్వకారణంగా నిలిచాడు. ఆయన పేరు గుర్తుకు వస్తే.. ధైర్యంతో ప్రకాశించే మొఖముతో సాటిలేని యోధుని చిత్రం మన మదిలోనికి వస్తుంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో స్వాతంత్య్రం కోసం ఆయన సాగించిన యుద్ధం ఎన్నటికీ గుర్తుండి పోతుంది. మేవార్‌ ‌రాజు అయినప్పటికి ఆయన జీవితంలో ఎక్కువ భాగం అడవులు, పర్వతాల్లోనే గడిపాడు.

రాణా ప్రతాప్‌ అత్యున్నత సంకల్ప శక్తి, సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో మేవారును విడిపించగలిగాడు. భౌతిక ఆనందాన్ని, లాభాలను త్యాగం చేస్తూ, తన మాతృభూమి స్వాతంత్య్రం కోసం ఆయన అలుపెరుగని పోరాటం చరిత్రలో చిరస్థాయిగా, ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. ఆయన లాంటి వ్యక్తిత్వం యావత్‌ ‌దేశానికి, అన్ని తరాలకు స్ఫూర్తి దాయకం. జాతీయ స్పృహ తగ్గుతున్న నేటి సమాజానికి రాణాప్రతాప్‌ ‌లాంటి వ్యక్తుల ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఢిల్లీ రాజ్యాధిపత్యాన్ని ఎదిరించడానికి సంఘటిత శక్తి అవసరమనే విషయాన్ని తెలియజెప్పినవాడు రాణాప్రతాప్‌. ‌మహారాణా ప్రతాప్‌ ‌మే 9, 1540న రాజస్థాన్‌లోని కుంబల్‌ ‌ప్రాంతంలో జన్మించాడు. 1568లో మేవార్‌ ‌పాలకుడిగా బాధ్యతలు తీసుకుని 1597 వరకు పరిపాలించాడు. చరిత్రకారుల ప్రకారం గొప్ప చక్రవర్తిగా పేరు పొందాడు. కాని నాడు ఢిల్లీ పాలకునిగా అక్బర్‌ ఉన్నాడు. స్వతంత్రం, ఆత్మ గౌరవం కోసం నిరంతరం మొగలాయిలతో పోరాటం చేస్తూ ఏనాడూ తలవంచలేదు. రాణాప్రతాప్‌ ‌తలదించి తన కాళ్ల మీద పడితే సగం హిందూస్థాన్‌కు రాజును చేస్తానన్నాడు అక్బర్‌. ‌కానీ, అక్బర్‌ ‌ప్రతిపాదన తుచ్చమైనదిగా తిరస్కరించాడు రాణా ప్రతాప్‌. ఆయన వాడిన ఆయుధాలు నేడు ఉదయ్‌పూర్‌ ‌మ్యూజియంలో ఉన్నాయి. రాణా ప్రతాప్‌ ‌వాడిన ఈటె బరువు 80 కిలోలు, కవచం 80 కిలోలు, రాణాప్రతాప్‌ ‌వాడిన ఆయుధాలు కత్తితో కలిసి 207 కిలోలు ఉండేవి. ఆయన 7 అడుగుల ఎత్తు ఉండేవాడు.

మహారాణా ప్రతాప్‌ ‌దగ్గర ఆయనకు అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు ‘‘చేతక్‌’’. అలాగే ఆయనకు మరీ నమ్మకమైన మరో జంతువు ఏనుగు. దాని పేరు ‘‘రామ్‌ ‌ప్రసాద్‌’’. అట్లాగే రాణాప్రతాప్‌ ‌జీవితంలో గుర్తుండిపోయి యుద్ధం ‘‘హల్దీఘాట్‌’’. ‌వీరి సైన్యంతో ప్రధానమైన వారు బిల్లులు.

ప్రపంచంలోనే గొప్ప సామ్ర్యాంగా కీర్తి గడించిన ఘనత వహించిన మొగల్‌ ‌సామ్రాజ్యానికి సామంతులుగా గానీ, వివాహ సంబంధాల ద్వారా గాని వారి ఆధిపత్యాన్ని అంగీకరించక, బిల్లుల సహాయంతో, ధైర్యమే ఊపిరిగా, సాహసమే ప్రాణంగా అడవులను, లోయలను రక్షించుకుంటూ కొనసాగిన వారు మేవార్‌ ‌రాణాలు.

హల్దీఘాట్‌ ‌యుద్ధం భారత చరిత్రలో అత్యంత ప్రసిద్ధ్దమైన, పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన యుద్ధం. ఇది జూన్‌ 18, 1576‌న రాజస్థాన్‌లోని ఆరావళీ పర్వత శ్రేణులలో ఉన్న హల్దీఘాట్‌ అనే ప్రదేశంలో జరిగింది. మేవార్‌రాజు మహారాణా ప్రతాప్‌కు, మొగలు సైన్యాలకూ మధ్య జరిగింది. మొగల్‌ ‌సైన్యానికి అంబర్‌రాజు, రాజా మాన్‌సింగ్‌ ‌నాయకత్వం వహించగా, ఎదురుగా రాజపుత్ర సైన్యానికి రాణా ప్రతాప్‌ ‌నాయకత్వం వహించారు. రాణాప్రతాప్‌ ‌వైపు రాజపుత్రులు, ఆప్ఘన్‌ ‌సైన్యం, బిల్లు తెగ యోధులు పోరాడారు. హల్దీ అంటే పసుపు ఇక్కడి మట్టి ఆ రంగులో ఉంటుంది. కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. చాలా భీకర యుద్ధం. మహారాణా ప్రతాప్‌ అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. కానీ మొగలుల భారీ సైన్యం, వారి తుపాకీ గుళ్ల ముందు ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. యుద్ధంలో స్పష్టమైన విజేత లేనప్పటికీ మొగలులు మేవార్‌ను పూర్తిగా స్వాధీనపరుచుకోలేకపోయారు.  రాణా ప్రతాప్‌ అడవులలోనికి వెళ్లిపోతూ గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాడు. ఈ యుద్ధంలో రాణాప్రతాప్‌ ‌గుర్రం ‘‘చేతక్‌’’ ‌వీరోచితంగా పోరాడి, తన యజమానిని శత్రువుల బారి నుండి తప్పించి ప్రాణాలు విడిచింది. చేతక్‌ ‌పడిపోయి మరణించిన ప్రాంతంలో రాణాప్రతాప్‌ ఒక చిన్న స్మారక చిహ్నం నిర్మించాడు. స్మారక చిహ్నం ఉన్న కట్టడంలో చేతక్‌ ‌పైకెక్కి కూర్చున్న మహారాణా కాంస్య విగ్రహం ఉంది.

రామ్‌‌ప్రసాద్‌ ‌మహారాణా ప్రతాప్‌కు చెందిన అత్యంత నైపుణ్యంగల విశ్వసనీయమైన యుద్ద ఏనుగు. ఇది హాల్దీఘాట్‌ ‌యుద్దంలో (1576)లో తన మావటి చనిపోయిన తరువాత కూడా స్వతంత్రంగా పోరాడుతూ, సుమారు 13-16 మొగల్‌ ఏనుగులను ఓడించి ప్రసిద్ధి చెందింది. మొగల్‌ ‌చక్రవర్తి అక్బర్‌ ‌చేత బంధించబడిన రామ్‌‌ప్రసాద్‌ 18 ‌రోజులపాటు తినడానికి, తాగడానికి నిరాకరించింది. అక్బర్‌ ‌దీనికి పీర్‌ ‌ప్రసాద్‌ అని పేరు మార్చాడు. దానితో 18 రోజుల తరువాత ప్రాణాలు విడిచింది. రామ్‌‌ప్రసాద్‌ ‌శౌర్యం గురించి స్వయంగా హల్దీఘాట్‌ ‌యుద్దంలో పాల్గొన్న బదయూనీ ‘‘ముంతకాబ్‌ ఉత్‌-‌తవారిక్‌ (‌సెలక్షన్‌ ఆఫ్‌ ‌క్రోనికల్్ర‌‌థంలో ఏనుగు తలవంచకపోతే దాని యజమాని (రాణా ప్రతాప్‌) ‌కూడా ఎప్పటికీ తలవంచడు అని ఇలా రాశాడు.

ప్రపంచ చరిత్రలో చూస్తే స్కాట్‌లాండ్‌ను 13వ శతాబ్దంలో ఇంగ్లండ్‌ ‌రాజు 1వ ఎడ్వర్డ్ ఆ‌క్రమించగా, విలియం వాలేస్‌ ‌తన పోరాటాన్ని ప్రారంభించి, ఇంగ్లీషు అధికారులను హతమార్చడం ద్వారా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జ్వాల రగిలించాడు, పాల్కిర్క్ ‌వద్ద వాలేస్‌ను ఓడించారు. దేశద్రోహ నేరం మోపి ఉరిశిక్ష విధించారు.

ఫ్రాన్స్ ‌దేశంలో జోన్‌ ఆఫ్‌ ఆర్క్ ఓ ‌వీరవని ఆమె ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఫ్రెంచ్‌ ‌సైన్యాన్ని నడిపించి, యుద్ధం చేసి, 1430లో ఆంగ్లేయులకు చిక్కగా, మే 30, 1431న ఆమెను సజీవ దహనం చేశారు.

సియోన్‌ ‌బొలివర్‌ (1780-1830) ‌దక్షిణ అమెరికా స్వాతంత్య్ర యోధుడు. స్పెయిన్‌ ‌పాలన నుండి దక్షిణ అమెరికా దేశాలను విముక్తి చేసి డిశంబర్‌ 17, 1830‌న మరణించాడు. ఆయన గౌరవార్థం బొలీవియా దేశానికి  ఆ పేరు వచ్చింది.

వెర్సింగెటోరిక్స్ ‌ఫ్రాన్స్‌లోని గౌల్‌ ‌ప్రాంతానికి చెందిన జాతీయవాది. రోమన్‌ ‌చక్రవర్తి జూలియస్‌ ‌సీజర్‌ ఆ‌క్రమణను ఎదిరించి పోరాడిన గల్లిక్‌ ‌తెగలను ఏకం చేసిన వీరుడు. అలాగే అమెరికాలో స్వాతంత్య్ర పోరాటం చేసిన జార్జివాషింగ్‌టన్‌ ‌కూడా ఈ కోవలోనికే వస్తారు.

మహారాణా ప్రతాప్‌ ‌గెరిల్లా యుద్దతంత్రం, మొగలులను ఎదిరించిన తీరు బట్టి ఛ•త్రపతి శివాజీని రాణాప్రతాప్‌తో ఆయనను పోలుస్తారు.

వీరు ధైర్య సాహసాలకూ, దేశభక్తికి ప్రతీకగా నిలిచారు. వీరందరిలో రాణాప్రతాప్‌ ‌స్థానం 500 సంవత్సరాల తరువాత కూడా స్మరించుకో గలుగు తున్నాము. మే 9వ తారీఖున ఆ మహ నీయుని జన్మదినం. చాలామంది చరిత్రకారులు రాణా ప్రతాప్‌ను భారతదేశపు మొదటి స్వదేశీ స్వాతంత్య్ర సమరయోధునిగా పిలుస్తారు.

Source: Maharana Pratap by Srirama Sharma

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు