
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం వేడుక జరగనుంది. ఉత్సవం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని అలంకరించి పుష్పపల్లకీపై తిరుమల వీధులగుండా ఊరేగిస్తారు.
శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానంలో భాగంగా ఉదయం బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో దేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామి గరుత్మంతునికి అభిముఖంగా, మరో పీఠంపై విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా కొలువుతీరతారు. మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు నివేదిస్తారు. పెద్దజీయర్ స్వామి మంగళవాయిద్యాల నడుమ వెండితట్టలో పట్టువస్త్రాలను తలపై ధరించి తీసుకురాగా.. మూలవిరాట్టుకు, మలయప్ప, విష్వక్సేనులకు సమర్పిస్తారు.
‘లచ్చన’గా పిలుచుకునే ఆలయ తాళపుచెవిగుత్తిని అర్చకులు- పెద్దజీయరు స్వామి, చిన్నజీయరు స్వామి, కార్యనిర్వాహక అధికారులకు వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. తర్వాత హారతి, చందనం, తాంబూలం, తీర్థం, ప్రసాదం, శఠారి మర్యాదలు నిర్వహిస్తారు. అంతటితో ఆణివార ఆస్థానం ముగుస్తుంది. సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకీపై స్వామి, అమ్మవారు కొలువుదీరిన నాలుగుమాడ వీధుల్లోని భక్తులకు అభయప్రదానం చేశారు.





