News

నూహ్ లో ఇంటర్నెట్, SMS సేవలపై నిషేధం

208views

నూహ్ లో జరగనున్న బ్రజ్ మండల్ యాత్ర సందర్భంగా అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు, SMS సేవలను కూడా జిల్లా యంత్రాంగం నిలిపేసింది. అయితే బ్యాంక్, మొబైల్ రీఛార్జీలకు సంబంధించిన SMS సేవలు మాత్రం ఎప్పటి లాగే కొనసాగుతాయని జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

ఈ ఉత్తర్వులను ఆదివారం రాత్రి 9 గంటలకు హోంశాఖ కార్యదర్శి జారీ చేశారు. ఈ ఆంక్షలు సోమవారం రాత్రి 9 గంటల వరకూ అమలులో వుంటాయి. నూహ్ లోని మహాభారత యుగం నాటి నల్హదేశ్వర్ శివాలయంలో జలాభిషేకం తీసుకెళ్లనున్న బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర జరుగుతుంది. దీని కోసం 12 కంపెనీల భద్రతా బలగాలను మోహరించారు. 14 మంది డీఎస్పీ స్థాయి అధికారులు బందోబస్తులో వుంటారు.

మరోవైపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. హోంశాఖ ఆదేశాల ప్రకారం పుకార్లను, తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి మొబైల్ ఫోన్లు, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్.. ఇలా అన్ని రకాల సోషల్ మీడియాకి సంబంధించిన SMS సేవలను నిలిపేశారు.అలాగే యాత్ర సమయంలో మతపరంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, కంటెంట్ తో పాటు లౌడ్ స్పీకర్లు, డీజేలను కూడా నిషేధించారు.

వీటితో పాటు మారణాయుధాలు, తుపాకులు, కత్తులు, రాడ్లు, గొలుసులతో పాటు లైసెన్స్ తుపాకులను తీసుకెళ్లడాన్ని కూడా నిషేధించారు. అయితే సిక్కు సమూహాలకు మాత్రం ఇందుకు మినహాయింపు వుంటుంది.తొడుగుతో కూడిన కృపాణ్ లను తీసుకెళ్లడానికి సిక్కు సమాజానికి అనుమతిని ఇచ్చారు.

2023 లో బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా రెండు గ్రూపుల మధ్య విపరీతమైన ఘర్షణలు తలెత్తాయి. ఇద్దరు పౌరులు మరణించగా, 15 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.వీటిని దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఈ సారి కఠిన నిబంధనలను విధించింది.