ArticlesNews

గురు పౌర్ణమి : ఎవరు గురువు? ఏది సమర్పణ?

394views

( ఆషాఢ పౌర్ణమి – వ్యాస పూర్ణిమ )

ప్రతి ఆషాఢ పౌర్ణమిరోజున గురుపూజ చేసుకునే ఆచారం అనాదిగా మన సమాజంలో నెలకొని ఉంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమ: త్రిమూర్తాత్మక స్వరూపం గురువు. అజ్ఞానాన్ని తొలిగించి జ్ఞానమును అందించేవారు గురువులు. అజ్ఞానం అంటే చదువులేకపోవడం, నిరక్షరాస్యత కాదు. ధర్మనిరతి, కర్తవ్యదీక్ష లేకపోవడం. ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ ఇవ్వలేని లేదా అవరోధాలు కల్పించే వాసనలు, భావనలు, కోరికలు వంటివి అజ్ఞానము. హిందూధర్మం అంటేనే మహోన్నత విలువలతో కూడిన జీవన విధానం. మన గురువులు అటువంటి విలువలను అనుష్ఠించారు. తమ శిష్యులతో అనుష్ఠింప చేశారు. మన మహర్షులందరు ఆ విలువలను పాటించినవారే. సాధించినవారే. సత్యకామ, జాబాలి, శంఖ లిఖితులు, ధౌమ్యుడు మొదలగు తపోధనుల జీవితాలలో ఈ అనుష్ఠానము కనపడుతుంది. అందువల్లనే ఈ దేశ జీవనంలో ఈ విలువలన్ని కొనసాగుతూ వచ్చినాయి.

సత్యం, అహింస, అపరిగ్రహం, ఆస్తేయం, ఇంద్రియ నిగ్రహం, శమదమాదులు వాటిలో కొన్ని. జీవనసమరంలో సతమతమవుతున్న నేటి తరాలకు పరంపరాగతమైన విలువల అనుష్ఠానంలో అనేక అవరోధాలు, ఆటంకాలు ఏర్పడవచ్చు. మన మార్గం నుంచి పక్కకు మళ్లించే ఆకర్షణలు, ప్రలోభాలు తారసపడవచ్చు. వీటి నుంచి మనలను మనం సంరక్షించుకుంటు సాగటానికి గురువుల మార్గదర్శనము అత్యంత ఆవశ్యకము.

లక్షల సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న సమాజం కాలానుగుణంగా అనేక మంది గురువులను స్వీకరించింది. వారిలో వేదవ్యాసులను అగ్రగామిగా పరిగణించింది. కనుకనే వ్యాసపూర్ణిమ గురుపూర్ణిమ అయింది. భోగలాలసత, రాజ్యగర్వం ప్రజలను హతాశులను చేసిన మహాభారత కాలంలో సనాతన ధర్మ పున:ప్రతిష్ఠకు వ్యాసుడు పడిన శ్రమ సామాన్యమైనది కాదు. అందుకే సమాజం వేదవ్యాసులవారిని గురువుగా స్వీకరించింది. వ్యాసపూర్ణిమ నాడు వ్యాసుల వారిని ఆరాధించి, విజ్ఞాన భాండాగారానికి ప్రతీక అయిన ‘వ్యాస పీఠం’ను పూజిస్తారు. గురుగోవింద్ సింగ్ కూడా తన తరువాత గురుగ్రంథ సాహెబ్‌ను సిక్కులకు గురువుగా అనుగ్రహించాడు. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అంటే ఇదేనేమే?

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నిర్మాత డాక్టర్జీ హిందూ సంస్కృతిలోని ఈ మౌలికతను అర్థం చేసుకొని, సంఘానికి కాషాయధ్వజాన్ని గురువుగా ఇచ్చారు. భారత జాతీయ ఆదర్శాలైన త్యాగం, సేవలకు ఈ ధ్వజం ప్రతీక. శ్రీరామచంద్రుడు ఎగురవేసినది ఈ ధ్వజాన్నే. కాషాయధ్వజాన్ని మనం భగవాధ్వజము అంటాము. అంటే భగవంతుని ధ్వజము అని అర్థం. ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపకులు పరమ పూజనీయ కేశవ బలిరాం హెడ్గేవార్ గారు శాస్త్రాలన్నీ అధ్యయనం చేసిన తర్వాతనే భగవాధ్వజాన్ని సంఘ్‌కు గురువుగా ఇచ్చారు. గురువుకు మనం ఇచ్చేది దక్షిణ. దక్షిణ అనే భావమే శ్రేష్ఠమైనది. శక్తి మేరకు దక్షిణను సమకూర్చుకొని, గ్రహీత పాదాల ముందుంచి స్వామీ ఈసారికింతే దయచేసి స్వీకరించండి. మరలా అవకాశముంటే ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటాను అని నమ్రతతో అర్పించుకునేదే దక్షిణ.

డాక్టర్ జీ గురుదక్షిణ ఇవ్వమనలేదు..సమర్పించమన్నారు. ఈ సమర్పణా భావం విశ్వాసం, దృఢ నిశ్చయం, త్యాగం యొక్క లక్షణాలను ప్రతిబింబిస్తుంది. 1948లో సత్యాగ్రహం, 1975 ఎమర్జెన్సీకి ప్రతిఘటన, దేశవ్యాప్తంగా రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఉద్యమం..ఇవన్నీ ఎలా సాధ్యం అంటే సమాధానం ‘సమర్పణ శక్తి’. ఆ సమర్పణనే మన పూర్వికులు మన నుంచి ఆశించారు.