News

‘నేను పాక్‌ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్‌ని’.. కస్టడీలో తహవ్వుర్‌ వ్యాఖ్య

195views

ముంబయి పేలుళ్ల కేసు కుట్రదారుడు తహవ్వుర్‌ రాణాను అమెరికా భారత్‌కు అప్పగించిన అనంతరం ప్రస్తుతం అతడు జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ముంబయి సహా భారత్‌లోని వివిధ ఉగ్రదాడుల విషయంలో ఆయన పాత్రపై ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో తహవ్వుర్‌ రాణా సంచలన విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. ముంబయి ఉగ్రదాడుల్లో తన ప్రమేయం ఉన్నట్లు అతడు అంగీకరించాడని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో తాను ముంబయిలోనే ఉన్నానని.. అంతేకాకుండా అప్పట్లో తాను పాకిస్థాన్‌ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్‌గా వ్యవహరించానని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.

గల్ఫ్‌ యుద్ధం సమయంలోనూ పాకిస్థాన్‌ సైన్యం తనను సౌదీ అరేబియాకు పంపిందని తహవ్వుర్‌ రాణా అధికారులకు తెలిపాడు. తాను, తన స్నేహితుడు హెడ్లీ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో అనేక శిక్షణ సెషన్‌లలో పాల్గొన్నట్లు పేర్కొన్నాడు. ఈ ఉగ్ర సంస్థ పాక్‌ గూఢచార నెట్‌వర్క్‌గానూ పనిచేస్తుందన్నాడు. ఉగ్రవాదుల ప్రణాళికలో భాగంగా తన సంస్థకు చెందిన ఇమిగ్రేషన్ సెంటర్‌ను ముంబయిలో ప్రారంభించడానికి తాను ముంబయికి వచ్చానని.. అందులోభాగంగా పలు ఆర్థిక లావాదేవీలు సైతం చేశానని అతడు పేర్కొన్నాడు. ఆ సమయంలో ముంబయిలోని ప్రఖ్యాత రైల్వేస్టేషన్‌ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సహా పలు ప్రదేశాలను సందర్శించినట్లు తెలిపాడు. ముంబయి దాడుల్లో పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సహకారం కూడా ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో వీలైనంత త్వరగా ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ముంబయి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

తహవ్వుర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. కొన్నేళ్లు లాస్‌ఏంజెలెస్‌ జైల్లో శిక్ష అనుభవించాడు. అతడిని తమకు అప్పగించాలంటూ భారత్‌ పలుమార్లు కోరగా ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అతడిని భారత్‌కు అప్పగించింది. నాటినుంచి రాణా జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు.