ArticlesNews

భజనల భూమికి తీర్థ యాత్ర….పండరీపూర్ వారీ యాత్ర

236views

విఠల… విఠల…విఠోభా.. పాండురంగా! అంటూ ఎలుగెత్తి స్వామిని కీర్తిస్తూ స్వామినిచూసేందుకు ఓ ఉద్యమంలా కదిలి..వయసుతో సంబంధం లేకుండా కొన్ని వందల కిలోమీటర్లు నడుస్తూ..తొలి ఏకాదశి నాటికి పాండురంగడి ఆలయాన్ని చేరుకుంటారు లక్షలాది మంది భక్తులు. అంగరంగ వైభవంగా సాగే ఈయాత్ర పేరే వారి. పండరీపురానికి వచ్చే భక్తుల్లో ఏడాదంతా వచ్చే వర్గం ఒకటైతే… ఆషాఢ, కార్తిక, మాఘ, చైత్ర మాసాల్లో మాత్రమే బృందంగా వెళ్లే వర్గం ఇంకోటి. మిగిలిన మూడు మాసాలతో పోలిస్తే ఆషాఢంలో లక్షల సంఖ్యలో భక్తులు వెళ్లేందుకు సిద్ధమవుతారు. పండర్‌పూర్‌ ఆషాఢవారీగా పిలిచే ఈ యాత్రలో పిల్లలు, పెద్దలు, స్త్రీ- పురుషులు, వృద్ధులు ఇలా అందరూ పాల్గొంటారు.

ఎనిమిదివందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యాత్ర ఆషాఢ ఏకాదశికి దాదాపు ఇరవైఒక్కరోజుల ముందుగా ప్రారంభమవుతుంది. కాషాయ జెండాలనూ, సంగీత వాద్యాలనూ పట్టుకుని పాండురంగడి మహిమల్ని కీర్తిస్తూ, భజనలు పాడుతూ ఆలయానికి చేరుకునే ఈ భక్తుల్ని వార్కరీలని పిలుస్తారు. చెప్పుల్లేకుండా కాలినడకన ఆలయానికి వెళ్లే ఈ వార్కరీలు రోజుకు ఇన్ని కిలోమీటర్ల చొప్పున నడుస్తూ సాయంత్రానికి విశ్రాంతి తీసుకుని మరునాడు మళ్లీ నడక ప్రారంభిస్తారు. ఈ యాత్రలో పాల్గొనే వారిని వార్కరీలుగా, డిండీలుగా అంటే భక్త బృందంగా పిలుస్తారు. వాళ్లు అనుక్షణం ధైవచింతనలోనే గడుపుతూ మితాహారం తీసుకుంటారు. వీళ్ళకోసం అన్నదాన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించే సంస్థలూ ఉంటాయి.

స్వామి భక్తులైన ధ్యానేశ్వర్‌ మహారాజ్‌, భక్త తుకారాం పాదుకల్ని ఆళంది, దేహుల నుంచి పల్లకిల్లో మోస్తూ వచ్చే భక్తులూ ఈ వారీలో కనిపిస్తారు. ఒకకప్పుడు కేవలం మహారాష్ట్రకే పరిమితమైన ఈ యాత్రలో ఇప్పుడు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక… తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొంటున్నారు. ఈ పండర్‌పూర్‌ వారీలో మహిళలూ- ప్రకృతి సహజంగా వచ్చే నెలసరితో సంబంధం లేకుండా – ఉత్సాహంగా ముందుకు కదులుతుంటారు. అలా వచ్చే స్త్రీలకు ఏ ఇబ్బందీ కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వం నెలసరి సమయంలో అవసరమయ్యే సరంజామానూ అందించడం ఒక్క ఈ ఆధ్యాత్మిక యాత్రలోనే కనిపిస్తుంది.

పండరీపురం వైష్ణవ ఆలయమైనా దీనికి దక్షిణ కాశీ అని పేరుంది. ఈ క్షేత్రంలో భగవంతుని కన్నా భక్తులకే తొలి ప్రాధాన్యం. అందుకే పాండురంగడి ఆలయానికి చేరుకునేముందు ఆయన భక్తుల్ని దర్శించుకోవాలన్నది ఇక్కడి నియమం. ఓ భక్తుడికి మోక్షసిద్ధిని ప్రసాదించేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన స్వామి ఇక్కడే కొలువుదీరడంతో పండరీపురం మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ లక్షల సంఖ్యలో భక్తుల్ని ఆకట్టుకుంటోంది, మహారాష్ట్రలోని వార్కరీ, కర్ణాటకలోని హరిదాసు లాంటి ఏకేశ్వరోపాసనా సంప్రదాయాలలో విఠోబా ప్రధాన దైవం.

విఠోబా గురించిన కథలన్నీ ఆయన భక్తుడు పుండరీకుడి చుట్టూ తిరుగుతాయి. ఈ పుండరీకుడే విఠోబాను పండరీపురమునకు రప్పించాడని భక్తుల విశ్వాసం. మరి కొన్ని కథలు ఆయన భక్తకవులను ఎలా కరుణించాడనే సంఘటనలమీద ఉంటాయి. ఈ వార్కరీ సంప్రదాయానికి చెందిన వాగ్గేయకారులు మరాఠీ భాషలో విఠోబా దేవునిపై అభంగాలు అనే దివ్య సంకీర్తనలు రచించారు. కన్నడదేశంలోని హరిదాసు సాంప్రదాయంలో స్తోత్రాలు, మరాఠీలోని హారతి పాటలు విఠోబా సాహిత్యంలో చెప్పుకోదగ్గవి. ఇక పండరీపురం ఆలయాన్ని హొయసల రాజైన విష్ణువర్ధనుడు పన్నెండో శతాబ్దంలో కట్టించాడని ప్రతీతి. ఏటా ఆషాఢంలో అంగరంగవైభవంగా సాగే ఈవారీ యాత్ర… స్వామి ఇక్కడ కొలువుదీరిన వైనం… నాటి భక్తులకు ప్రత్యేక మందిరాలు ఉండటం… స్వయంగా గర్భగుడి లోపలికి వెళ్లగలగడం… ఇలా పండరీపురంలో ప్రతిదీ ఓ విశేషమే. ఇక, ఆషాఢ ఏకాదశి నాడు పాండురంగడు- రుక్మిణి-రాధ విగ్రహాలను ఊరేగించే వేడుక పూరీ రథయాత్రను తలపిస్తుంది. ఆషాఢ పౌర్ణమితో ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని ఆనందంగా వెనుతిరుగుతారు భక్తులు.