ArticlesNews

మ‌న్యం విప్ల‌వ జ్వాల అల్లూరి సీతారామ‌రాజు

301views

( జూలై 4 – అల్లూరి సీతారామ‌రాజు జయంతి )

స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేకమంది ఉద్యమకారుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. తెల్ల దొరలకు సింహస్వప్నంగా నిలిచిన ఆయ‌న గొప్ప విప్లవ వీరుడు, పోరాట యోధుడు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఓ అధ్యాయం. మన్యం ప్రాంతంలో గిరిజనులను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. తన పోరాట పటిమతో ఆంగ్లేయుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించారు. కొన్నేళ్లపాటు సమరశీల ఉద్యమాలకు నేతృత్వం వహించారు.

విశాఖ జిల్లా పాండ్రంగిలో 1897 జూలై 4న అల్లూరి జన్మించారు. ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. నరసాపురం, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం, తుని, కాకినాడ సహా పలుచోట్ల ఆయన విద్యాభ్యాసం సాగింది. 1908లో సీతారామరాజు ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఆయన తండ్రి మరణించారు. ఆ తరువాత అల్లూరి విద్యాభ్యాసం ముందుకు సాగలేదు. ఆ త‌ర్వాత 1916 ఏప్రిల్ 26 న ఉత్తర భారత యాత్రకు బయలుదేరారు. బెంగాల్‌లో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నారు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు అల్లూరి హాజరయ్యారు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతం అధ్యయనం చేశారు. బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు సంద‌ర్శించారు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, 1918లో యోగిగా సొంతగడ్డకు చేరుకున్నారు. 1

919 నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం పై పోరాటం మొదలు పెట్టిన అల్లూరి.. 20 ఏళ్ల వయస్సు నిండకుండానే అడవి బాటపట్టారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ప్రారంభించే నాటికి మన్యంలో అటవీ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాల ఆగడాలు తీవ్రంగా ఉండేవి. వారి చేతిలో ఆదివాసీ గిరిజనులు తీవ్రమైన అన్యాయానికి, హింసకు గురయ్యేవారు. అటవీ ఫలసాయాలను ముట్టుకోరాదని, పోడు వ్యవసాయాన్ని చేపట్టరాదని ఆంక్షలు విధించ‌డం గిరిజనులపై ఆర్థికంగా, సామాజికంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. స్వేచ్చగా, స్వతంత్రంగా జీవనం సాగించే గిరిజనులు ఇందుకు భిన్నంగా తెల్లదొరల పాలనలో నిత్యం భయంతో గ‌డ‌పాల్సిన పరిస్థితి ఎదురైంది. వీటన్నింటి మధ్య నలిగిపోతున్న గిరిజనానికి అల్లూరి ఓ వెలుగు దివ్వెలా కనిపించారు. గిరిజనానికి మద్దతుగా నిలిచి బ్రిటిష్ సైనికులపై పోరాటానికి నడుంకట్టారు. బ్రిటిష్ సైనికులను ఎదుర్కోవడానికి విల్లంబులు, క‌త్తులు వంటి సంప్ర‌దాయ ఆయుధాలు సరిపోవని గుర్తించిన ఆయ‌న‌… ఆధునిక ఆయుధాల సమీకర‌ణ కోసం గిరిజనులతో కలసి పోలీస్ స్టేషన్లపై సాయుధ దాడులకు సిద్ధపడ్డారు.

అల్లూరి నేతృత్వంలో వరసగా ఐదు రోజుల పాటు జరిగిన ఈ దాడులు తెల్లదొరలను హడలెత్తించాయి. 1922 ఆగస్టు 22న మొదటిసారిగా చింతపల్లి పోలీస్ స్టేషన్పై మెరుపుదాడి చేశారు. 12 తుపాకులు, 1595 తుపాకీ గుళ్లు, 5 కత్తులు, 14 బానెట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ స్టేషన్ దస్త్రాల్లో రాసి అల్లూరి సంతకం చేసి మరీ వెళ్లారు. ఆ త‌ర్వాత కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం పోలీస్ స్టేషన్లపై దాడులు కొనసాగించారు. ఎలాంటి రవాణా సాధనాలు లేని ఆ రోజుల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను పట్టుకెళ్లడం నాటి బ్రిటిష్ పాలకులను బిత్తరపోయేలా చేసింది. రహదారులపై ఎక్కడికక్కడ చెట్లను నరికి రవాణా, సమాచార వ్యవస్థను స్తంభింపజేశారు.

విప్లవ వీరుణ్ని కట్టడి చేయడానికి గంజాం, కొరాపుట్, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల రిజర్వ్ పోలీసులు, మలబార్ స్పెషల్ పోలీసులు, ఈస్ట్ కోస్ట్ బెటాలియన్ అసోం, గూర్ఖా పటాలంతో పాటు అందుబాటులో ఉన్న బలగాలన్నింటినీ బ్రిటిష్ అధికారులు రంగంలోకి దించారు. అయినా సీతారామరాజు వెనక్కి తగ్గలేదు. దాడులను నియంత్రించడానికి బ్రిటిష్ అధికారులు మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, ఏలేశ్వరం, జడ్డంగి, పాడేరు, నర్సీపట్నం, లంబసింగి, కృష్ణదేవిపేట, శరభన్నపాలెం, చింతలపూడి, కాకరపాడు, రాజేంద్రపాలెం, మర్రివాడలను మిలటరీ కేంద్రాలుగా మార్చారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు అనేక విజయాలు సాధించి పెట్టిన గెరిల్లా యోధులు లియోనెల్ నెవెల్లీ హైటర్, క్రిస్టోఫర్ విలయం స్కాట్ కవర్డ్ ల‌ను రంగంలోకి దించారు.

1922 సెప్టెంబరు 24న గూడెం కొండల వద్ద అటవీ ప్రాంతంలో అల్లూరి వీరిద్దరినీ ఊహించని రీతిలో హతమార్చారు. ఇది తెల్లదొరలను మరింత భయభ్రాంతులకు గురిచేసింది. ఈ దశలోనే అల్లూరి మరోసారి 1922 అక్టోబరులో అడ్డతీగల, రంపచోడవరం పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. వరుస వైఫల్యాలతో రెచ్చిపోయిన బ్రిటిష్ సైనికులు అదే ఏడాది డిసెంబర్ 6న పెద్దగెడ్డ, లింగాపురం గ్రామాలపై దాడులు చేసి అల్లూరి అనుచరులుగా ముద్రపడిన 13 మంది పోరాట యోధులను చంపి, వారి మృతదేహాలను గిరిజన గ్రామాల్లో ఊరేగించారు. అయినా అల్లూరి పోరాట పటిమ నిర్విరామంగా సాగింది. 1923 ఏప్రిల్ 17న అన్నవరం పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ దశలోనే అల్లూరి ముఖ్య అనుచరులు ఒక్కొక్క‌రుగా తెల్లదొరలకు పట్టుబడ్డారు.

1924 మేలో మన్యంలో ఉద్య‌మాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం రూథ‌ర్‌ఫ‌ర్డ్‌ అనే అధికారిని విశాఖ కలెక్టర్‌గా నియమించింది. నాటినుంచి బ్రిటిష్ సైనికుల అకృత్యాలు పెచ్చుమీరాయి. అల్లూరి ముఖ్య అనుచరుడు గాము గంటన్నదొరను కాల్చిచంపారు. విప్లవకారుల ఆచూకీ కోసం గృహ దహనాలు, గిరిజన మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు. గూడేలకు గూడేలను తగలబెట్టించారు. పోరాటంలో నాయకత్వం వహించిన అగ్గిరాజు పట్టుబడటంతో ఉద్యమం బలహీన పడింది. 1924 మే 7న అల్లూరి కొయ్యూరు సమీపాన గల వాగు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత ఎటువంటి విచారణ లేకుండానే ఆయన్ను చెట్టుకు కట్టి, తుపాకీతో కాల్చి చంపారు. అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు.. సమూహ శక్తి. సంగ్రామ భేరి. స్వాతంత్ర్య సమర గీతం.. ఉద్యమ జ్వాల.. విప్లవ స్ఫూర్తి, ఆయన నడిపిన మన్యం పోరాటం చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది.