
( జూలై 4 – పింగళి వెంకయ్య వర్ధంతి )
“మూడు రంగులు….” భారత స్వాతంత్ర్య సంగ్రామానికి ఊహించని ఉత్సాహాన్ని అందించాయి. అవే మూడు రంగులు ఒక అర్ధరాత్రి రెపరెపలాడుతుంటే…అది చూసి ఈ దేశం మురిసిపోయింది.
ఆ మూడు రంగులని చూడగానే ప్రతి భారతీయుడి మనసు సంతృప్తి, కీర్తితో ఉప్పొంగి పోతుంది.ఆ మూడు రంగులే మన బలం… మన ఐకమత్యం… మన కీర్తి…మన గౌరవం…దేశ సరిహద్దులో రక్షణగా ఉండే ప్రతి సైనికుడికి ఆ మూడు రంగులే తోడు, ధైర్యం.. స్వాతంత్ర్య భారత సమర స్ఫూర్తికి పర్యాయపదంగా మారిన “త్రివర్ణ పతాక సృష్టికర్త, బహుభాషావేత్త, స్వాతంత్ర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త మరియు జియాలజిస్ట్” గా మన దేశానికి సేవలందించిన పింగళి వెంకయ్య గారి వర్ధంతి నేడు.
జాతీయ జెండా రూపకర్త అని పెద్దగా చెప్పుకునేది ఏముంది అని మనందరికీ అనిపించవచ్చు. కానీ ఒక దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతినీ, చరిత్రను తెలిపే చిహ్నం ఈ జాతీయ పతాకం. కనుక ఆ జెండా సృజనాత్మకతతో ఆలోచించి, ప్రముఖులందరితో చర్చించి, మేధావుల యొక్క సూచనలను పరిగణలోకి తీసుకొని రూపకల్పన చేయడం జరుగుతుంది. ఆ తరువాత చట్టసభలలో ప్రజా ప్రతినిధుల ఆమోదంతో ఆ పతాక ఆవిష్కరణ రాజ్యాంగ పరంగా ఆమోదముద్ర పొందుతుంది. మరి ఇన్ని అవరోధాలను అన్నింటినీ త్రికరణ శుద్ధితో అధిగమించి నేటి మన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు అందుకోసం దశాబ్దకాలం శ్రమించాడు. ఎందరో ప్రముఖుల అభిప్రాయాలను స్వీకరించి ఆ పిమ్మట తన ఆలోచనలకు ఒక రూపం కల్పించారు. కనుకనే మన జాతీయ జెండా ‘త్రివర్ణ పతాక’మై నేటికీ రెపరెపలాడుతున్నది.
నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో 1876, ఆగస్టు 2న పింగళి వెంకయ్య గారు జన్మించారు. తన ప్రాధమిక, ఉన్నత విద్యానంతరం భూగర్భ శాస్త్రవేత్తగా గుర్తింపు పొంది మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడగలిగే వెంకయ్య గారిని “జపాన్ వెంకయ్య” గా సంబోధించేవారు కొందరూ. రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య గారికి వ్యవసాయం పట్ల చాలా మక్కువ ఉండేది. అదే మక్కువతో వ్యవసాయ శాస్త్రంలో కూడా అధ్యయనం చేశారు. అమెరికా నుండి పత్తి విత్తనాలను తెప్పించి పండించారు. అందుకే ఆయన్ను పత్తి వెంకయ్య అని కూడా అనేవారు. వెంకయ్య గారు అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ మొదలగు ప్రదేశాలలో ఖనిజ నిల్వల మీద పరిశోధన కొనసాగించారు. అంతవరకూ శాస్త్రీయంగా వజ్రాలు బొగ్గు నుంచి ఉత్పన్నం అవుతాయని అందరూ భావించేవారు. కానీ వెంకయ్య గారు మొదటిసారిగా వజ్రపు తల్లి రాయిని కనుగొని ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఆవిష్కరణ మీద ఒక ఆంగ్ల పుస్తకం కూడా రచించారు. దాంతో ప్రజలు వెంకయ్య గారిని వజ్రాల వెంకయ్య అని కూడా సంబోధించేవారు.
నిస్వార్థంతో, గాంధేయవాదిగా అతి సాధారణమైన జీవితాన్ని గడిపిన పింగళి వెంకయ్య గారు చేసిన సేవ అనితరము. ఆయనలాగే దేశ సేవకే తమ జీవితాలను అంకితం చేసిన ఎందఱో మహానుభావులు, వారి సేవలకు సరైన గుర్తింపు లభింపక మరుగున పడిపోయారు. వెంకయ్య గారు కూడా తన వృద్ధాప్యంలో ఆర్ధిక సమస్యలతో సరైన సహాయం అందక ఎన్నో ఇబ్బందులు పడి 1963 జూలై 4న తన ఎనభై ఆరో ఏట పరమపదించారు.
మనకు భారత్ అనగానే మొదట ఏం గుర్తుకువస్తుంది. భారత జెండానే కదా…అలాంటి గుర్తింపు మనకిచ్చిన మహర్షికి మనం ఏమివ్వగలం. ఆ మహాత్ముడు ఇచ్చిన పతాకాన్ని ప్రపంచ నలుమూలల రెపరెపలాడించడం తప్ప. మన జాతీయ జెండా ఎగురుతున్నంత కాలం తెలుగు వారి గుండెల్లో పింగళి వెంకయ్య గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన వర్ధంతి సందర్భంగా మన జాతీయ పతాక సృష్టికర్తను ఒక సారి మనసారా స్మృతింద్దాం.





