
మంత్రి శివన్ కుట్టి విషయంలో కేరళ రాజ్ భవన్ గట్టి వైఖరి తీసుకుంది. భవిష్యత్తులో జరగబోయే అన్ని కార్యక్రమాల్లో భారతమాత చిత్రపటం వుండితీరుతుందని రాజ్ భవన్ తేల్చి చెప్పింది.అంతేకాకుండా దీపారాధన కూడా వుంటుందని కూడా ప్రకటించింది. రాజ్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత మాత చిత్రపటం వుండటం, దీపారాధన చేయడాన్ని నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ప్రొటోకాల్ ను పాటించకుండా వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్ పై నిర్ణయాన్ని తీసుకుంది.
అయితే.. రాజ్ భవన్ వర్గాలు మంత్రిపై ఎలాంటి చర్యలు గానీ, విమర్శలు గానీ చేయలేదు. కానీ బలమైన ఓ సమాధానాన్ని మాత్రం ఇచ్చేసింది. ‘‘భారతమాతను తొలగించే ప్రశ్నే లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అన్నారు. ఎందుకంటే మనం దేశభక్తి, జాతీయత అన్న ఆలోచనలను భారత మాత నుంచే పొందుతాం.’’ అని రాజ్ భవన్ ఈ నెల 19 న ఓ ట్వీట్ చేసింది.
అయితే.. వామపక్ష పినరయ్ ప్రభుత్వం మరోలా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్ భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో భారతమాత చిత్ర పటం వుండడాన్ని వ్యతరికిస్తూ.. న్యాయపరమైన కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో భారత మాత ఫోటో ఉపయోగించే విషయంలో ఏదైనా ప్రొటోకాల్ వుందా? అలాంటి విషయాల్లో మంత్రివర్గం సలహా ఇచ్చే అధికారం వుందా? వీటన్నింటిపై తమకు న్యాయ సలహా కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ కార్యదర్శిని సలహా ఇవ్వాలని కోరింది. ఈ సలహా తర్వాత తదుపరి చర్యలు వుంటాయని అంటున్నారు.
కొన్ని రోజుల క్రితం రాజ్ భవన్ లో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాజ్య పురస్కార అవార్డు ప్రదానోత్స కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్, విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి హాజరయ్యారు. ఈ సమయంలో భారత మాత చిత్ర పటాన్ని వుంచారు. అలాగే దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని పాటించారు. దీనిని మంత్రి శివన్ కుట్టి వ్యతిరేకిస్తూ, ప్రోటోకాలం పాటించకుండా వాకౌట్ చేశారు .దీంతో వివాదం రేగింది. భారత మాత చిత్ర పటాన్ని వుంచమని ముందస్తు హామీ ఇచ్చారని అన్నారు. కానీ అక్కడికి వెళ్లగానే భారత మాత చిత్రపటం కనిపించిందని, అందుకే వాకౌట్ చేశానని ప్రకటించారు.
తీవ్రంగా స్పందించిన రాజ్ భవన్
అయితే.. మంత్రి చేసిన వ్యాఖ్యలను రాజ్ భవన్ ఖండించింది. తోసిపుచ్చింది. మంత్రి ప్రవర్తన బాగో లేదని, ప్రోటోకాల్ ను ఉల్లంఘించారని, గవర్నర్ కార్యాలయాన్ని తీవ్రంగా అవమానించారని మండిపడింది. గవర్నర్ కి వుండే ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్ వెళ్లేవరకూ వేదికపై వుండే ప్రముఖులు అక్కడే వుండాలన్న ప్రొటోకాల్ వుంది. దీనిని మంత్రి ఉల్లంఘించారని, కనీసం గవర్నర్ కి సమాచారం చెప్పకుండానే వెళ్లిపోయారని రాజ్ భవన్ తెలిపింది.
వచ్చే యేడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల నుంచి తమ ఓటు బ్యాంకుకు ఎదురుదెబ్బ తగులుతుందని వామపక్ష ప్రభుత్వం తీవ్రంగా భయపడుతోందని, అందుకే రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమాలకు రావడానికి విముఖత చూపిస్తోందన్న వాదనలు బలంగా వున్నాయి.





