
సరైన అనుమతులు లేకుండా ఇంటిని ప్రార్థనా సమావేశ మందిరంగా మార్చరాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. గృహంలో ప్రార్థనా సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా సంబంధిత ప్రభుత్వాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. తిరువారూర్ జిల్లాలోని కొడవసల్‌కు చెందిన పాస్టర్ ఎల్.జోసఫ్ విల్సన్ ముందస్తు అనుమతులు లేకుండా తన ఇంటిలో ప్రార్థనా సమావేశాలు నిర్వహించడంతో స్థానిక తహశీల్దార్ సదరు పాస్టర్ ఇంటికి సీలు వేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పాస్టర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా, తహశీల్దార్ చర్యలను న్యాయమూర్తి ఎన్.ఆనంద్ వెంకటేష్ సమర్థిస్తూ, ఇంటిలో ప్రార్థనా సమావేశాలు నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరి అని స్పష్టీకరించారు.
ఇంటిలో ప్రార్థనా సమావేశాలు నిర్వహించేందుకు నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల అనుమతి ఉండాలని న్యాయమూర్తి తెలియజేశారు. సొంత ఇల్లు అయినంతమాత్రాన అనుమతులు లేకుండా ప్రార్థన సమావేశాలు నిర్వహించుకునే హక్కు పిటిషనర్‌కు లేదని తన తాజా ఉత్తర్వులో న్యాయమూర్తి పేర్కొన్నారు. సమష్టి ప్రచార వ్యవస్థ(లౌడ్‌స్పీకర్, యాంప్లిఫైయర్, మైక్రోఫోన్)ను వినియోగించనంటూ పిటిషనర్ ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ, సమస్య లౌడ్ స్పీకర్, మైక్రోఫోన్ ఉపయోగించడం పై కాదని, ఇంటిని ప్రార్థనా మందిరంగా మార్చడం పైన, కనుక అధికారుల నుంచి సరైన అనుమతి అవసరమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
పిటిషనర్ తన ఇంటిని ప్రార్థనా సమావేశాలకు ఉపయోగించనంటే సీల్ తొలిగించాలని సంబంధిత తహశీల్దార్‌కు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ పిటిషనర్ తన ఇంటిని ప్రార్థనా మందిరంగా మార్చాలనుకుంటే జిల్లా కలెక్టర్ నుంచి సరైన అనుమతి పొందాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇళ్లను ప్రార్థనా సమావేశాలకు ఉపయోగిస్తున్నట్లైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులకు స్వేచ్ఛ ఉందని తెలిపారు





