
( జూన్ 23 – డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం )
బ్రిటిష్‌వారు స్వాతంత్ర్యం ఇచ్చే ముందు అఖండ భారతావనిని ముక్కలు చేసి పాకిస్తాన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఆ పాకిస్తాన్ పుట్టక ముందే దాన్ని చీల్చడంలో సఫలీకృతుడయ్యారో నాయకుడు. పశ్చిమ బంగ ఏకమొత్తంగా తూర్పు పాకిస్తాన్‌లో కలవకుండా ఉందంటే ఆ మహనీయుని పుణ్యమే. ఖండిత భారత అఖండత్వం కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన ఆ మొట్టమొదటి దేశభక్తుడు మరెవరో కాదు ఆయనే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. నేడు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగంగా ఉందంటే అందుకు కారణం కూడా ఆయనే. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1953 జూన్ 23న జమ్మూకాశ్మీర్‌లో అనుమానాస్పదంగా మరణించారు. వారి జీవితంలో ప్రతిక్షణం, శరీరంలో ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యాయి. కనుకనే, ఆయన ప్రాణత్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా జూన్ 23న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్‌గా జరుపుకుంటూ ఆయనకు ప్రగాఢ నివాళులు అర్పించుకుంటున్నాము.
వ్యక్తిగత ప్రతిష్టకన్నా దేశ హితమే ప్రధానమనే విధానం కలిగిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1901 జూలై 7వ తేదీన అసుతోష్ ముఖర్జీ, రాణి జోగ్మయాదేవి పుణ్యదంపతులకు జన్మించారు. 1919లో ఇంటర్ పూర్తి చేశారు. 1921లో బి.ఏ. ఆనర్స్ పట్టా ప్రధమ శ్రేణిలో 1923లో ఎం.ఏ. పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. 1924లో కొంత కాలం హై కోర్టు న్యాయవాదిగా పని చేసిన ఆయన అదే ఏడాదిలో కలకత్తా విశ్వవిద్యాలయం సిండికేట్ స్థానంలో ముఖర్జీ నియుక్తులయ్యారు. 1934లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. 1936లో కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ మాట్లాడుతూ, “భౌతిక సుఖాలే లక్ష్యంగా మనుషులను యంత్రాలుగా మార్చి పని చేయించే విధానాల ద్వారా ఏ జాతి గొప్పదనాన్ని సాధించలేదు. పాశ్చాత్యుల నైపుణ్యం, విజ్ఞానం నుండి శక్తిని సంపాదించుకునే విధంగా మన సంస్కృతి, నాగరికతలతో విద్యా విధానాన్ని అనుసంధానం చేయడమే మన ఆదర్శం కావాలి,” అని ఆ సమయంలో ఆయన పిలుపునిచ్చారు.
తన తండ్రి అసుతోష్ ముఖర్జీ నుంచి అనేక గొప్ప గుణాలను శ్యామా ప్రసాద్ ముఖర్జీ పుణికి పుచ్చుకున్నారు. వాటిలో అతి ప్రముఖమైనవి రాజీలేని జాతీయ భావన, నిర్భయమైన మనస్తత్వం. ‘స్వదేశాన్ని, మాతృ సమాజాన్ని ప్రేమించడం, వేయి సంవత్సరాల బానిసత్వం నుంచి విముక్తి పొందిన కోట్లాది మంది హిందువులను సమైక్య పరిచేందుకు స్వామి వివేకానంద ప్రవచించిన హిందుత్వ సూత్రాలకు అనుగుణంగా, గత వైభవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయడమే మతతత్వమైతే, మతతత్వవాదిని అయినందుకు గర్వపడతాను. హిందూ పదం వింటేనే భయపడి పారిపోయేవారి వల్ల ఈ దేశ భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం పరిరక్షింపబడటం అసాధ్యం’ అంటూ స్పష్టంగా చాటారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. దేశ స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన తొలి జాతీయ ప్రభుత్వంలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. చిత్తరంజన్ రైలు ఇంజన్ కర్మాగారం, సింద్రీ ఎరువుల కర్మాగారం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి భారీ పరిశ్రమలు ఆయన నేతృత్వంలోనే రూపొందాయి. శ్యామా ప్రసాద్ మనసులో రూపుదిద్దుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధానమే ఆ తదుపరి దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మేధావుల చేతుల్లో మెరుగు దిద్దుకుని భారతీయ జన సంఘ్‌కి ఆ తరువాత భారతీయ జనతా పార్టీకి కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారం అయింది.
కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయంప్రతిపత్తిని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని తీసుకురావడాన్ని ఖండించారు. దీనిని జాతి, దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ జమ్మూకశ్మీర్‌లో పర్యటించాలని బయల్దేరగా గుర్తింపు కార్డు లేకుండా కాశ్మీర్‌లోకి ప్రవేశించారనే సాకుతో షేక్ అబ్దుల్లా ప్రభుత్వం మే11, 1953న శ్యామా ప్రసాద్ ముఖర్జీని అరెస్టు చేసింది. కాశ్మీర్ జైలులో ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో జూన్ 23న ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం నేటికీ అనుమానాస్పదంగానే మిగిలింది. అలా దేశ సమైక్యతా మహాయజ్ఞంలో సమిధగా ఆహుతయ్యారు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. మనం మరచిపోకూడని ఆధునిక భారతదేశ నిర్మాత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ.





