News

యోగా మానవతను పెంచే సామూహిక ప్రక్రియ : ప్రధాని మోదీ

255views

విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తదితరులు యోగాసనాలు వేశారు. అంతకు ముందు మోదీ.. యోగా స్మారక పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేశారు. ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌’ నినాదంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విశాఖ ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు యోగాసనాలు వేశారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘‘అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారు. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు’’ అని మోదీ అన్నారు.

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘యోగా దినోత్సవం రోజు విశాఖలో రికార్డు సృష్టించబోతున్నాం. 1.44 లక్షల మంది యోగా శిక్షకులు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. నిన్న 22 వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డు సాధించారు. రోజూ గంట సేపు యోగా చేస్తే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.