ArticlesNews

గొప్ప అవధూత శ్రీపాకలపాటి గురువులు

297views

( జూన్ 11 – శ్రీపాకలపాటి గురువులు జయంతి )

భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఈ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులకు కరుణించి మోక్షం ఇచ్చారు. నేటికీ ఇస్తున్నారు. కొందరు సిద్దపురుషుల వివరాలు తెలుసుకునే కొద్ది విచిత్రంగా ఉంటాయి. వారు మహిమలు చెయ్యరు కానీ వారిలోని గురుత్వము వస్త్రము వెనక నెగడు వలె ప్రకాశిస్తూ ఉంటుంది. వారు మూర్తీభవించిన ప్రేమతో సర్వులనూ సమానంగా చూస్తారు. శ్రీ పాలకపాటి గురువుగారిని గురించి మనకు తెలిసినప్పుడు ఆ విషయము పూర్తిగా అర్థమవుతుంది. వీరిని భక్తులు గురువుగారని, బాబు గారని పిలిచేవారు. ఈయన కోయలు, గిరిజనుల కోసం ఎంతో కృషి చేశారు. వైజాగు నుంచి విజయనగరం వైపుగా ఉన్న పాకలపాటిలో వారు నివసించారు. కోయవారికి ఆయన ఆరాధ్యదైవము. వానరులకు శ్రీరామునిపై గల భక్తి ఎలాంటిదో ఈ కోయవారికి గురువుగారిపై అంతటి భక్తి.

శ్రీపాకలపాటి గురువుగారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి దగ్గరలో ముండూరు అగ్రహారంలో 1911 జూన్ 11న జన్మించారు. తండ్రి పేరు దామరాజు గంగరాజు, తల్లి పేరు వెంకమ్మ. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన శ్రీపాకలపాటి గురువుగారు మేనత్త వద్ద పెరిగారు. ఆయన ఓ రాత్రి ఎవరికీ చెప్పాపెట్టకుండా దేశాటనక బయల్దేరారు. అలా కలకత్తా మెయిల్‌లో ప్రయాణిస్తుండగా టికెట్ లేని కారణంగా బాబుగారిని టీసీ నర్సీపట్నంలో దించేయడంతో ఆయన కాలినడకన కలువరాయికి చేరారు. అలా కలువరాయిలో ఉన్నప్పుడే పాకలపాటి గురువుగారి ప్రతిభ కనబడుతూ ఉండేదట. ఆ పల్లెలోనే ఆయన శ్రీ కావ్యకంఠ గణపని మునిని కలుసుకొని మంత్రదీక్ష పొందారు.

శ్రీ పాకలపాటి గురువుగారు ఏజెన్సీ అడవులలో ఆటవికులకు పరమార్థిక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ పెక్కు ఆశ్రమాలను స్థాపించారు. ఆటవికులకు రామభజనలు నేర్పారు. ఆయన అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండే రెండు పులులు ఆయన ప్రక్కన కూర్చోని ఆయన మీద ఎండ పడకుండా తమ తలను నీడగా పెట్టేవట. దూరం నుంచి చీకట్లో సైతం ఆయన దేహం మెరుస్తూ కనపడేదని అటవీకులు అనుకునేవారు. శ్రీ పాకలపాటి గురువులు గిరిజనుల కోసం దాదాపు 900 పల్లెలు నిర్మించారు. వ్యవసాయవంతమైన భూమి చూపించి పండించుకోమన్నారు. ఆయన ప్రతి ఊరులో ఒక మేకు నాటి అక్కడ దీపం వెలిగించేవారు. కష్టాలను ఆ దీపానికి చెప్పమనేవారు. అలా చెప్పుకుంటే వారి కష్టాలు తీరిపోయేవి. ఆయన అడవుల్లో తాంత్రికాన్ని మాన్పించారు. నరమాంసభక్షణ చేసే కొంతమంది ఆటవికులను ఆ అలవాటు నుంచి మార్చారు. ఎందరో గిరిజనులు భక్తితో రామభజనలు పాడుతూ బాబుగారి ముందు నృత్యం చేసేవారు.

మనకు చేతనైనంతగా ఎలాంటి ఆర్భాటము లేకుండా చెయ్యాలనేదే వారి బోధ. అడిగినవారికి లేదనవద్దని చెప్పేవారు. అది సామాన్యముగా చెయ్యాలని ఆర్భాటాలు వద్దని చెప్పేవారు. ప్రకృతి, వృక్షాలు, పైర్లు, పశువులు అలాగే సేవ చేస్తున్నాయని బాబుగారు చెప్పేవారు. శ్రీపాకలపాటి గురువుగారు 1970 శివరాత్రినాడు శివైక్యం చెందినా తరువాత కూడా భక్తులకు, గిరిజనులకు కనపడి రక్షిస్తూ ఉన్నారు. వారి ఆశ్రమం నేటికీ విశాఖ దగ్గర లంబసింగిలో ఉంది.