
నంద్యాల జిల్లా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో నంద్యాలలోని స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలోని వివేకానంద ఆడిటోరియంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దక్షిణాపథంలో మొఘల్ పాలకులకు ఎదురొడ్డినిలచి స్వతంత్ర హిందూరాజ్య స్థాపన చేసిన యోధుడు శివాజీ అని కొనియాడారు.దేశభక్తిని, ఆయనను అలా తీర్చిదిద్దిన మాతా జిజియా భాయ్ గొప్పతనాన్ని తెలియ జేశారు.

ఈ సందర్బంగా ప్రధాన వక్త ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ కామనూరు మనోహర్ మాట్లాడుతూ, శివాజీ యుద్ద తంత్రం, పరిపాలనా విధానం, ఆర్థిక విధానాలు, విదేశీ వాణిజ్యం, విదేశీ విధానం యొక్క ఆనవాళ్ళు మనం లోతుగా పరిశీలిస్తే మొన్న జరిగిన ఆపరేషన్ సిందూర్ లో కనపడ్డాయని తెలియ జేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శివాజీ విధానాలను, పరిపాలనా రీతులను నిరంతరం అధ్యయనం చేస్తున్న కారణం గానే సంఘ్ స్వయం సేవకుల పరిపాలన విధానంలో ఆయన యుద్ద రీతులు ద్యోతక మయ్యాయని తెలియజేశారు. ఆపరేషన్ సిందూర్ ఎంత నిశబ్దంగా ప్రారంభ మయ్యిందో అంతే నిశబ్దంగా ముగిసిందన్నారు. కానీ దాని ప్రభావం మాత్రం కొన్ని దశాబ్దాలు పునశ్చరణ చేసుకునేలా ఉందని తెలిపారు.

సంఘ్ స్వయం సేవకులుగా మన దేశకాల పరిష్థితులను మనదైన శైలిలో విశ్లేషించు కుంటూ ప్రతి చిన్న విషయానికి బలప్రదర్శనకు దిగకుండా, బల సమీకరణ చేసుకుంటూ సరైన సమయంలో ప్రతిభావంతంగా మన ప్రతిచర్య ఉండాలని పిలుపు నిచ్చారు.

తదుపరి సభ్యులందరు శివాజీ మూర్తికి పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ్ చాలక్ శ్రీ చిలుకూరు శ్రీనివాస్, ముఖ్య అతిథి ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ గాండ్ల నరహరిలతో పాటుగా , స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





