
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తిరుమలలో భద్రత బలోపేతంపై రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, టిటిడి ఈవో జె.శ్యామలరావు సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో తిరుపతి ఎస్పీ, తితిదే ఇన్‌ఛార్జ్ సీవీఎస్‌వో హర్షవర్ధన్ రాజు భద్రతా అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని తెలిపారు. ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డు, సివిల్ పోలీసులు, తితిదే సెక్యూరిటీతోపాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలన్నారు. అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీలతో కలిసి సెన్సార్ ప్లే సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.
తితిదే ఈవో జె. శ్యామలరావు మాట్లాడుతూ.. భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. విస్తృతస్థాయిలో తిరుమల భద్రతపై సమీక్ష నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ(లా అండ్ ఆర్డర్) సుధాకర్‌రెడ్డి, అడిషనల్ డీజీ (ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లద్దా, అనంతపురం రేంజ్ డీఐజీ డా.శేముషి, ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, తితిదే అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





