News

వివేక్‌ రామస్వామిపై జాతి విద్వేష వ్యాఖ్యలు

234views

బయోటెక్‌ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన ప్రముఖ రిపబ్లికన్‌ నాయకుడు వివేక్‌ రామస్వామిపై అమెరికన్లు జాతి విద్వేష వ్యాఖ్యలకు దిగారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పంచుకున్న పోస్టుపై వలస వ్యతిరేక వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రామస్వామి, ఆయన భార్య డాక్టర్‌ అపూర్వ ఇద్దరివీ భారత మూలాలే. వారికిద్దరు పిల్లలు.

వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివేక్‌ రామస్వామి ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘2011లో అపూర్వ అనే తెలివైన వైద్య విద్యార్థినిని కలిశాను. తొలి డేటింగ్‌ కోసం రాకీ సానువుల్లోకి ఫ్లాట్‌టాప్‌ పర్వతంపైకి హైకింగ్‌కు వెళ్లాం. దారిలో మంచు తుపాను విరుచుకుపడింది. అయినా శిఖరంపైకి వెళ్దామని నేను మూర్ఖంగా పట్టుబట్టాను. అందుకు జీవితకాలం ఉందంటూ అపూర్వ వారించింది. ఇది జరిగి 14 ఏళ్లు. ఈ వారాంతం మా పదో వివాహ వార్షికోత్సవం.

ఈ సందర్భంగా ఫ్లాట్‌టాప్‌ శిఖరాన్ని అధిరోహించాం’’అంటూ అక్కడ దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్టుపై అమెరికన్లు తీవ్రంగా ట్రోల్‌ చేశారు. ‘గో బ్యాక్‌ టు ఇండియా’, ‘మీ నాన్నను ఎప్పుడు బహిష్కరిస్తారు?’‘పర్వతపు తెలుపు అందాలను గోధుమ రంగు (భారతీయుల ఒంటి రంగును ఉద్దేశించి) నాశనం చేసింది’, ‘భారత్‌ తిరిగి వెళ్లి అక్కడ ట్రెక్కింగులు చేసుకోండి’అంటూ సోషల్‌ మీడియాలో విద్వేష వ్యాఖ్యలకు దిగారు.

వివేక్‌ ఒహాయో గవర్నర్‌ పదవికి పోటీ పడుతున్నారు. అందుకోసం డోజ్‌ సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకొన్నారు. కానీ ఆయనను గెలిపిస్తే హెచ్‌–1బీ వీసా తదితరాలపై వలసదారులకు అనుకూల వైఖరే ప్రదర్శిస్తారంటూ ట్రోలర్లు ఆక్షేపించారు. నిజానికి వివేక్‌ గతంలో వలసవాదులకు అనుకూలంగా మాట్లాడినా కొంతకాలంగా హెచ్‌–1బీ వీసా పథకం తదితరాలను వ్యతిరేకిస్తున్నారు. భారతీయ అమెరికన్లు కూడా దీనిపై ఆయన్ను తీవ్రంగా తప్పుబడుతున్నారు.