News

సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం

373views

సమాజానికి దిశా నిర్దేశం చేయడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. కూస రాంజీ అన్నారు. సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక మహతి లలిత కళావేదికలో బుధవారం దేవర్షి నారద జయంతి మహోత్సవం జరిగింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలో సాహితీ సుధా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో “నారదజయంతి” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయులైన ముదిగొండ శాస్త్రి, సామా సునీల్,పైడిపాముల అశోక్ కుమార్, కారుమూరి రాజేంద్ర ప్రసాద్ లను సాహితీ సుధా ఫౌండేషన్ తరపున నిర్వాహకులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డా. రాంజీ మాట్లాడుతూ, యువత మంచి మార్గంలో నడవడానికి, వారిలో దేశభక్తి పెంపొందించడానికి పాత్రికేయులు కృషి చేయాలన్నారు. పాత్రికేయ రంగంలో యువతను భాగస్వాములుగా చేయాలన్నారు. సమాజానికి మేలు చేసే విధంగా పాత్రికేయులు వ్యవహరించాలన్నారు.

ముఖ్య వక్తగా పాల్గొన్న పెడన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు కాళ్లకూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్రహ్మ మానస పుత్రుడు దేవర్షి నారదుడు. నారాయణ మంత్ర వ్యాప్తి, సమాచారం అందజేత ధ్యేయంగా కర్తవ్యాన్ని పాలించాడన్నారు. నారద మహర్షి లోక కళ్యాణం కొరకు సత్యనిష్ట, ధర్మనిష్టలతో సమాచారం అందించేవాడని అన్నారు.

హిందూ కళాశాల విశ్రాంత అధ్యాపకులు డా. బొమ్మరాజు సారంగపాణి కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు ముదిగొండ శాస్త్రి, కారుమూరి రాజేంద్ర ప్రసాద్, పైడిపాముల అశోక్ కుమార్, సునీల్ లను ఘనంగా సత్కరించారు. పుష్పాల విజయభారతి ఆలపించిన గేయం సంఘటనే ధ్యేయంగా సాగుతున్న సంఘమిది… ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మహతి కళావేదిక వ్యవస్థాపకుడు డా.బి ధన్వంతరి ఆచార్య భవిష్య, టీ పెద్దిరాజులు, కే చంద్రశేఖర్, కూనపరెడ్డి శ్రీనివాసరావు, ధూళిపాళ శ్రీరామ చంద్రమూర్తి, తదితరులు పాల్గొన్నారు.