ArticlesNews

హిందూ రాష్ట్ర సిద్ధాంతకర్త వీర్ సావర్కర్

267views

( మే 28 – వీర్ సావర్కర్ జయంతి )

సావర్కర్ అనగానే మనకు విప్లవ వీరుడే గుర్తుకు వస్తాడు. కానీ అయన వ్యక్తిత్వం, రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రజ్ఞ, దార్శనికత, సాహిత్య కృషి, హిందూ సమాజానికి చేసిన సేవలు బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే క్రాంతికారుల బలిదానాల విలువను గుర్తించడం అరుదు. 1883 మే 28వ తేదీన మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని భాగూర్ గ్రామంలో దామోదర్ పంత్, రాధాబాయి సావర్కర్ దంపతులకు రెండవ కుమారునిగా జన్మించి, 1966 ఫిబ్రవరి 26వ తేదీన మహా నిర్యాణం చెందిన వినాయక్ రావు సావర్కర్ జీవితం మన స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన పార్శ్యం. అతి చిన్న వయసులో సావర్కర్ సోదరులు తమ కుల దేవతయైన భవానీ మాత చెంత భారతమాత స్వాతంత్ర్యానికై తమ సర్వస్వమూ త్యాగం చేస్తామని ప్రతిన పూనారు. కొంతమంది స్నేహితులను కలుపుకొని మిత్రమేళా అనే పేరుతో విప్లవకారుల బృందాన్ని తయారు చేశారు. నాలుగైదు సంవత్సరాలలో ఆ బృందం ‘అభినవ భారత్‌’గా అవతరించి అనేక రూపాలలో పశ్చిమ మధ్య భారత్, ఐరోపా, కెనడా, ఇంగ్లండ్, జపాన్ దేశాలలో భారత స్వాతంత్ర్య సాధనకై పని చేసింది.

నాసిక్‌లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాక పుణేలోని పెర్గూసన్ కళాశాలలో చదువుకునే రోజులలో లోకమాన్యతిలక్‌తో ఆయన పరిచయం బార్-ఎట్-లా పట్టా కోసం లండన్ ప్రయాణానికి దారి తీసింది. లండన్‌లో ఐరోపా దేశాలలోని అనేక విప్లవ బృందాలతో పరిచయాలు ఏర్పరచుకున్నారు. ఇండియా హౌస్‌లో నెలకొల్పిన విప్లవ బృందం భారతదేశానికి ఆయుధాలు, విప్లవ సాహిత్యం పంపడం వంటి పనులు చేసేవారు. 1910 మార్చి 13న విప్లవ కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకుగాను ఆయనను అరెస్టు చేసి యాభై సంవత్సరాల కఠిన శిక్ష విధించి అండమాన్ దీవులకు తరలించారు. సావర్కర్ ఆస్తి మొత్తం జప్తు చేశారు. మనకు స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆయన ఆస్తి తిరిగి ఇవ్వలేదు.

ఏ పరిస్థితుల్లో తానున్నా లక్ష్యాన్ని మరువకపోవడం సావర్కర్‌లోని విశేషం. అండమాన్ జైలు గోడల మీద అనేక గీతాలు రచించి, విడుదల కాబోయే ఖైదీలకు నేర్పి, వారి ద్వారా మహారాష్ట్రలో ప్రచారం చేసేవారు. ఆ జైలులో ఉన్నప్పుడే కమల, సప్తఋషి, వీరోచ్వాసి అనే గీతాలు, కాలాపానీ, మోప్లాంచిబంద్ అనే నవలలు మాజీ జన్మలేప్ అనే స్వీయ చరిత్ర, నన్యస్థ ఖడ్గ, ఉషాప్, ఉత్తరక్రియ అనే నాటకాలు రచించారు. భారతదేశంలో ఆయన విడుదలకై జరిగిన పోరాటల వల్ల పదకొండు సంవత్సరాల తర్వాత భారతదేశంలోని జైలుకు మార్చారు. చివరకు ఐదు సంవత్సరాలు రాజకీయాలలో పాల్గొనకూడదనే ఆంక్షలతో 1924లో ఆయనను జైలు నుంచి విడుదల చేశారు. ఆ 5 సంవత్సరాల కాలాన్ని ఆయన హిందువులకు సంఘటితం చేసేందుకు, సామాజిక చైతన్యానికి ఉపయోగించుకున్నారు. రత్నగిరి జైలులో ఉండగా ఆయన రచించిన హిందుత్వ అనే పుస్తకం హిందూ నిర్వచనానికి ఉపనిషత్తుల వంటిది.

సావర్కర్ పై విధించిన ఆంక్షలన్నీ తొలిగాక 1937 నుంచి హిందూ మహాసభ అధ్యక్షునిగా ప్రత్యక్ష రాజకీయాలలో చాలా కృషి చేశారు. ఆయనకు ఏ మతం పైనా ద్వేషం లేదు. కానీ హిందూ జాతిని మనస్ఫూర్తిగా ప్రేమించారు. ఆయన గొప్ప రాజకీయ దార్శనికుడు. దేశ విభజన జరిగి ఒక ముస్లిం దేశం ఏర్పడగలదని 1937లోనే అన్నారు. 1963లో భారతదేశంపై చైనా యుద్ధం ప్రకటించినప్పుడు ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన కళ్లల్లో నీళ్లు మొదటిసారి చూశానని ఆయన కుమారుడు తెలిపాడు. 1966లో తనకు తీరవలసిన కోర్కెలేమీ లేవని, ధ్యేయసాధన పూర్తయింది కాబట్టి స్వసంకల్పంతోనే తన దేహాన్ని త్యజిస్తానని సావర్కర్ ప్రకటించారు. అందుకు తగ్గట్టే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆహారం, మందులు నిరాకరించి 22 దినాలు కొద్ది నీతితో మాత్రం జీవించి ఫిబ్రవరి 26వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు దేహత్యాగం చేశారు.

మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక సావర్కర్ రెండు దశాబ్దాలు జీవించినప్పటికీ ఆయన సేవలను మన జాతి పూర్తిగా ఉపయోగించుకోలేకపోవడం విషాదకరం. సావర్కర్ జీవితం అంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయన పట్ల నిర్దయగానే వ్యవహరించింది. మహాత్మాగాంధీ హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారు. అనంతరం నిర్దోషిగా విడుదల చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రతిహతీ స్వాతంత్ర్య వీర అనే బిరుదుతో గౌరవించింది. సావర్కర్ చరిత్రను నేటి తరానికి పరిచయం చేయడం ఎంతైనా అవసరం.