News

దౌత్య యుద్ధం దెబ్బకు దిగొచ్చిన పాక్‌!

337views

దౌత్య యుద్ధం దెబ్బకు పాకిస్తాన్‌ దిగొచ్చింది. భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ కీలక ప్రకటన చేశారు. కశ్మీర్‌ సహా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమంటూ ఇరాన్‌ వేదికగా ప్రకటించారాయన.

పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిల పక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో.. ఇరాన్‌ పర్యటనలో ఉన్న పాక్‌ ప్రధాని‌ షెహ్‌బాజ్‌ షరీఫ్‌ శాంతి ప్రస్తావన తెస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘భారత్‌తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీర్‌, ఉగ్రవాదంపై పోరు, నీటి పంపకం, వాణిజ్యం.. ఇలా అన్ని వివాదాలపై ఇరు దేశాలం సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్‌ గనుక సమ్మతిస్తే.. మేం శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్లకు తెలియజేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రకటనను పాక్‌ పత్రిక ది డాన్‌ ప్రముఖంగా ప్రచురించింది.

మరోవైపు.. టెహ్రాన్‌లో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీతో చర్చలు జరిపారు. ఈ భేటీకి పాక్‌ సైన్యాధ్యక్షుడు అసీమ్‌ మునీర్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగానూ భారత్‌తో ఉద్రిక్తతలు, గాజా అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు డాన్‌ కథనం పేర్కొంది. పాక్‌ శాంతి ప్రతిపాదనను ప్రశంసించిన ఇరాన్‌.. ఇరు దేశాలు(భారత్‌-పాక్‌) మధ్య త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌ పేరిట పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను భారత సైన్యం నాశనం చేసింది. ఆపై పాక్‌పై దౌత్యపరమైన యుద్ధం చేస్తోంది. ఆ దేశ దౌత్యవేత్తలను వెనక్కి పంపించేసింది. ఉగ్రవాదాన్ని పాక్‌ ఎలా పెంచి పోషిస్తూ ప్రోత్సహిస్తోందనే విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వినిపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అగ్రదేశాలు సహా పలు దేశాలు భారత్‌కు మద్ధతు ప్రకటించాయి. ఈ క్రమంలో పాక్‌కు నిధులు సమకూర్చకూడదని ఐఎంఎఫ్‌కి కూడా విజ్ఞప్తి చేసింది కూడా. అయితే

తాజాగా ఇస్లామాబాద్‌ వర్గాలు దీర్ఘకాలికంగా కొనేసాగుతున్న వివాదాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీకి కబురు పంపాయి. భారత ప్రధాని మోదీ మాత్రం ఆ చర్చలు పరిమితంగానే ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారు. పాక్‌తో చర్చలు గనుక జరగాల్సి వస్తే.. అది పీవోకే, ఉగ్రవాద అంశాలపై మాత్రమేనని కుండబద్ధలు కొట్టారు.