ArticlesNews

బ్రెయిలీలో అన్నమాచార్య కీర్తనలు

296views

అంధులకు అన్నమాచార్య కీర్తనల పుస్తకాలెందుకు? ఎంతోమంది ఈ మాట అన్నా ఆమె మాత్రం పట్టుదల వీడలేదు. వారిలో ఆమె తనని చూసుకున్నారు. అందుకే, పట్టుబట్టి బ్రెయిలీలో ముద్రించారు… డా. బాగేపల్లి ఈశ్వరి. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్‌లో తంబుర కళాకారిణి ఈమె!

శ్రీవారి కీర్తనలకు 32 ఏళ్లుగా తంబుర వాయిస్తున్నా. నేనూ మా బృందం ఓ కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తుండగా… ఓ కళ్లు లేని వ్యక్తి వాటిపై ఆసక్తి కనబరిచారు. ఆ సంఘటనే వాళ్లకోసం అన్నమాచార్య సంకీర్తనలను అందుబాటులోకి తేవాలన్న ఆలోచన నాకు కలిగించింది. వంద పేజీల చొప్పున తొమ్మిది పుస్తకాల్లో 956 సంకీర్తనలు ముద్రించా. వీటికోసం ఏడాది కష్టపడ్డా. ఎందుకంటే నాలా మరెవ్వరూ జీవితంలో నిరాశ పడకూడదనే. చిన్నప్పుడు పదో తరగతి ఫెయిలయ్యానని ఇంట్లో వాళ్లే ‘నీకింక చదువు అబ్బదు’ అని నిరాశ పరిచారు. భరతనాట్యమంటే ఇష్టమని, నేర్పించమంటే ఖర్చు ఎక్కువని తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాలలో చేర్పించి… హరికథలు చెప్పుకొని బతకమన్నారు. ఆపై కొన్నాళ్లకే పెళ్లి చేశారు. చిన్న వైఫల్యానికే నేను ఆగిపోవాలా అనిపించి పట్టుదలతో ప్రయత్నించా. సంగీతం నేర్చుకుంటూనే సప్లిమెంటరీలో టెన్త్‌ పాస్‌ అయ్యాను. తరవాత తితిదేలో హరికథలు చెబుతూ సంగీతంలో సర్టిఫికెట్‌ కోర్సు చేశా. నా కచేరీలకు ఆదరణ లభించడంతో 1992లో అన్నమాచార్య కళామందిరంలో తంబుర కళాకారిణిగా అవకాశం వచ్చింది. ‘కదిగొండ వెంకట్రామ్‌ సాహిత్యం’పైన ఎస్వీయూ నుంచి పీహెచ్‌డీ చేశా.

తాజాగా బ్రెయిలీలో ఇలా సంకీర్తనలు
తీసుకొచ్చా. ఇందుకుగానూ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లు దక్కాయి. గతేడాది అన్నమాచార్య జయంతి ఉత్సవాల్లోనే ఈ పుస్తకాలను ఆవిష్కరించాలనుకున్నా. ‘అంధులకు వీటితో పనేముంది’ అన్నారు చాలామంది. నేను ఆ మాటల్ని పట్టించుకోలేదు. తాజా ఉత్సవాల్లో ఆవిష్కరించడమే కాదు, అంధులతో కచేరీనీ చేయించాను. శ్రీవారి కీర్తనలు ఆలపిస్తూ వాళ్లు ఆనందిస్తోంటే చాలా సంతోషంగా తోచింది. ఈ పుస్తకాలను తెలుగు రాష్ట్రాల్లోని లైబ్రరీల్లో లభించేలా ఏర్పాటూ చేశా. భరతనాట్యం నా చిన్ననాటి కల. అందుకే, మా ఇద్దరమ్మాయిలను అందులో ప్రోత్సహించా. శిక్షణ కేంద్రం ప్రారంభించి పేదవారికి ఉచితంగా నేర్పిస్తూ సర్టిఫికెట్, డిప్లొమా పరీక్షలూ రాయిస్తున్నా. అన్నమాచార్య కీర్తనలను ప్రచారం చేయడంలో కీలకంగా వ్యవహరించినందుకు ఎన్టీఆర్‌ పురస్కారం, హరికథ కళారత్నోత్సవ, హరికథ కళాశిరోమణి తదితర పురస్కారాలూ అందుకున్నా.