
ఇస్లాంలో అమలు జరుగుతున్న బహు భార్యాత్వ విధానం దుర్వినియోగం అవుతున్నదని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకటి కంటె ఎక్కువ వివాహాలకు ఇస్లాం అనుమతిస్తున్నప్పటికీ ఇది పెద్ద స్థాయిలో దుర్వినియోగమే అవుతున్నదని ప్రకటించింది. కొన్ని పరిస్థితులు, కొన్ని షరతుల మేరకు మాత్రమే ఒకటి మించి వివాహాలు చేసుకోవడానికి ఇస్లాం అనుమతిస్తున్నది. కొన్ని వివాహాలు ముస్లిం చట్టానికి విరుద్ధంగా కూడా జరిగిపోతున్నాయని హైకోర్టు పేర్కొన్నది. ఈ ఆదేశం ఇచ్చిన జస్టిస్ అరుణ్కుమార్ సింగ్ దేశ్వాల్ ధర్మాసనం కొన్ని కీలక అంశాలనే ప్రస్తావించింది. బహుభార్యాత్వాన్ని షరతుల మేరకు మాత్రమే ఇస్లాం ఆమోదించిందని జస్టిస్ దేశ్వాల్ చెప్పారు. యుద్ధాలు ఎక్కువ జరుగుతున్న కాలంలో భర్తలను కోల్పోయిన వారికి, అనాథలకు ఉపకరించే తీరులో ఈ ఆచారాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు మాత్రం స్వార్ధం కోసం బహు భార్యాత్వాన్ని ఉపయోగించుకుంటున్నారని జస్టిస్ వ్యాఖ్యానించారు.
ఫర్డాన్, మరో ఇద్దరు మొరాదాబాద్ కోర్టు తమకు పంపిన సమన్ను సవాలు చేస్తూ వారు హైకోర్టుకు వచ్చినప్పుడు ఈ ఆదేశం వెలువడింది. సెక్షన్ 376 (లైంగిక అత్యాచారం), సెక్షన్ 495 (మొదటి వివాహం సంగతి దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకోవడం) కింద ఆ ముగ్గురికి సమన్స్ వెళ్లాయి. అప్పటికే వివాహమైన సంగతిని మరుగుపరచి ఫర్టాన్ తనను పెళ్లి చేసుకున్నాడని అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అలాగే వివాహం సమయంలో అతడు తన మీద లైంగిక దాడి జరిపాడని కూడా ఆమె ఆరోపించారు. అయితే ఈమె తనతో శారీరక సంబంధం తరువాతే వివాహం చేసుకుందని ఫర్హాన్ ఆరోపించాడు. 1935 నాటి షరియా చట్టం, 1937 నాటి షరియా చట్టం ఒక ముస్లిం పురుషుడు నాలుగు వివాహాలు చేసుకోవచ్చునని చెబుతున్నదని, అలాగే అంతకు ముందు చేసుకున్న భార్య ఉన్నా కూడా వివాహం చేసుకోవచ్చునని చెబుతున్నదని ఫర్హాన్ తరఫు న్యాయవాది వాదించాడు.





