
పురాణాలు మన పుణ్యభూమిలోని అమూల్య రత్నాలు. మనకు లభించిన అయాచిత వరాలు. పురాణాల్లో ప్రస్తావితం కాని విషయం లేదు. జీవితం సక్రమమైన మార్గంలో నడవడానికి కావాల్సిన వనరులన్నీ వాటిల్లో పుష్కలంగా ఉన్నాయి. పురాణం అంటే పాణిని చెప్పిన ప్రకారం ‘పురాభవం’. ‘ప్రాచీన కాలంలో జరిగింది’ అని అర్థం. యాస్కుని నిరుక్తం వివరించిన తీరులో ‘పురానవం భవతి’ అంటే ప్రాచీనమైనదైనా నిత్య నూతనంగా ఉంటుందన్నది నిర్వచనం.
పురాణాలు ప్రణవం నుంచి పుట్టాయని భాగవతంలోని పన్నెండో స్కంధం తెలుపుతోంది. పురాణానికి సర్గం- సృష్టిని విస్తరించేది, ప్రతిసర్గం- లయ కారకాన్ని తెలిపేది, వంశం- వంశోత్పత్తిని వివరించేది, మన్వంతరం- ఆయా కల్పాల్లోని మనువుల కాలాల్లో జరిగింది వివరించేది, వంశానుచరితం- సూర్య, చంద్ర వంశస్థుల కథలు… అని అయిదు లక్షణాలు ఉంటాయి. కొంతమంది పండితులు మరో అయిదు లక్షణాలు కలిపి వాటిని మహాపురాణాలు అంటారు. పురాణ సంహితలను పద్దెనిమిది పురాణాలుగా విస్తరింపజేయడం వేదవ్యాసుని కృషి ఫలితం. మత్స్య, కూర్మ, వామన, వరాహ, గరుడ, వాయు, నారద, స్కాంద, విష్ణు, భాగవత, అగ్ని, బ్రహ్మ, పద్మ, మార్కండేయ, బ్రహ్మవైవర్త, లింగ, బ్రహ్మాండ, భవిష్యపురాణాలు- అష్టాదశ పురాణాలు. వీటిని శ్రీమహావిష్ణువు శరీర భాగాలుగా భావిస్తారు. పురాణాలన్నింటిలో మార్కండేయ పురాణం చిన్నది. పద్మ పురాణం పెద్దది. వైష్ణవ పురాణాలు- సాత్విక గుణాన్ని, బ్రహ్మ పురాణాలు – రాజస గుణాన్ని, శైవ పురాణాలు- తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి. పురాణాలు ధర్మాధర్మాల మధ్య భేదాన్ని, పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని, గీతాసారాన్ని వివరిస్తాయి. ఖగోళ శాస్త్రం, రుతువులు, జనన మరణ రహస్యాలు, అంతరిక్షం, భూగోళ విశేషాలూ వాటిలో ఉంటాయి. వ్రతకల్పాలు, నదులూ చెట్ల విశిష్టత, భోజన నియమాలు, తులసి, సాలగ్రామ మహాత్మ్యాలు, అవతారాలు, భవిష్యత్ సంఘటనల్లాంటి మరెన్నో అంశాల గురించి కూడా ఇవి కూలంకషంగా చెబుతాయి.
పురాణం వింటే మంచి విషయాలు మనసుకు పడతాయని, బుద్ధి వికసిస్తుందని పెద్దల అభిప్రాయం. పూర్వం ఆశ్రమాల్లో గురువులు శిష్యులకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను బోధించేవారు. దానివల్ల వారిలో ధారణశక్తి, ఏకాగ్రత పెరిగేవి. ఉత్తమ నడవడిక అలవడేది. హరికథలు, బుర్రకథల ద్వారా పౌరాణిక విషయాలు జనావళికి చేరేవి. పెద్దవాళ్లు పిల్లల్ని కూర్చోబెట్టి విన్న, చదివిన కథలు చెప్పేవారు. పసితనంలోనే వారిలో భక్తితో పాటు సామాజిక చింతన కలిగేది. పురాణాల్లోని అవతార రహస్యాలు, మహారాజుల కథల ఆంతర్యం అదే. పంచభూతాలను, జీవులను, మొక్కలను పూజనీయం చేశాయి పురాణాలు. సమస్త ప్రకృతీ ఆరాధనీయం అనేది పురాణాల అంతస్సందేశం. మనదేశ సంస్కృతి మనకిచ్చిన పౌరాణిక వారసత్వ సంపదను సద్వినియోగం చేసుకోవడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదు. మన విజ్ఞతకు తార్కాణం అది.





