
ప్రశాంతంగా ఉండే విజయనగరం కలవరపాటుకు గురవుతోంది. పేలుడు పదార్థాలు, వాటికి అవసరమైన పీవీసీ పైపు ముక్కలు, ఇతర సామగ్రి కొని ఐఈడీ (ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) తయారీకి ఉపక్రమించిన సమయంలోనే ఉగ్రవాద భావజాలం గల సిరాజ్‌పై మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అందులో అంశాలు ఇవి.. విజ్జీ స్టేడియానికి వెళ్లే రోడ్డులోని రాజానగర్ వద్ద పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రి ఉన్న బ్యాగ్‌తో మోటారుసైకిల్‌పై సిరాజ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశంలో ఐఈడీ పేల్చేందుకు వచ్చానని విచారణలో వెల్లడించాడు. ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలు ఏప్రిల్ 20, 26, 30 తేదీల్లో సమీపంలోని ఉర్దూ పాఠశాల చిరునామా పేరిట వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత రెండు సిమ్ నంబర్లు గల సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాస్‌వర్డ్‌తో వాటిని ఓపెన్ చేయించారు. అందులో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, సిగ్నల్, టెలిగ్రామ్ సామాజిక మాధ్యమ యాప్‌లు ఉండడంతో విస్తుపోయారు. అందులో సిరాజ్‌తో పాటు సమీర్ మధ్య పేలుడు పదార్థాల సేకరణ, ఉపయోగంపై సాగిన చాటింగ్‌ను పరిశీలించారు..
కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
సిరాజ్, సమీర్‌లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయనగరం రెండో పట్టణ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదప్రతివాదనలు విన్న న్యాయాధికారి తీర్పును రిజర్వు చేశారు. దీనిపై బుధవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో లోతైన విచారణకు నిందితులను పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. పేలుళ్ల కుట్రపై నమోదైన కేసులో మరింత సమాచారం సేకరణకు వచ్చిన ఎన్‌ఐఏ అధికారుల బృందం విజయనగరంలోనే మకాం వేసింది. దాదాపు పది మంది అధికారులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సిరాజ్, సమీర్ మధ్య పేలుడు పదార్థాల వినియోగానికి సంబంధించి జరిగిన చాటింగ్
పేలుడు పదార్థాల సీజ్.. పోలీసుల విచారణలో సిరాజ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. బ్యాగ్‌లోని పేలుడు పదార్థాలు సహా మోటార్‌సైకిల్‌ను పోలీసులు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. సౌదీలోని అబూత్ ఆలెం అలియాస్ అబు ముసాబ్ తనతో పాటు సమీర్‌కు తరచూ సిగ్నల్ యాప్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసేవాడని అంగీకరించాడు.
పోలీసుల అదుపులో వ్యాపారులు..
నగరంలోని కన్యకాపరమేశ్వరి కోవెల ప్రాంతంలో వ్యాపారాలు సాగిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి గల కారణాలను చెప్పలేదు. ఇటీవల ఉగ్రవాద సంబంధాలు కలిగిన ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పేలుళ్లకు సంబంధించి వారికి సరకులు అమ్మడంతో స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.





