
హరియాణాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్ముదాబాద్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈసందర్భంగా ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టును ఉద్దేశిస్తూ న్యాయస్థానం మందలించింది. పబ్లిసిటీ పొందేందుకు ఇలాంటి చర్యలు ఎందుకంటూ ప్రశ్నించింది.
తనకు బెయిల్ మంజూరుచేసి విచారణ నిలిపివేయాలని ఇటీవల అలీఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటేశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈసందర్భంగా అలీఖాన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. తన క్లయింట్ ఆ పోస్టులో నేరపూరిత ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఏమున్నాయ్ అని వాదించారు.
ఆయన వాదనపై స్పందిస్తూ జస్టిస్ కాంత్ మాట్లాడారు. ‘‘అసలు ఏం జరుగుతోందో మీరు తెలుసుకోండి. భావ వ్యక్తీకరణ చేసే హక్కు ఉంటుంది. కానీ, ఆ విషయం గురించి మాట్లాడే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి అందరూ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. కానీ, బాధ్యతల గురించి ప్రస్తావించడం లేదు. భావ వ్యక్తీకరణ చేసే హక్కు కచ్చితంగా ఉంటుంది. కానీ, వీటన్నింటి గురించి మాట్లాడే సమయం ఇదేనా..? కొందరు రాక్షసులు వచ్చి భారత్‌పై దాడి చేశారు. ఇప్పుడు మనమంతా ఐక్యంగా ఉండాలి. ఇలాంటి సమయంలో పబ్లిసిటీ పొందేందుకు ప్రయత్నాలు ఎందుకు..?’’అని మందలించారు.
కాగా.. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న కారణంతో హరియాణాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్ముదాబాద్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజనీతి శాస్త్ర విభాగంలో అలీఖాన్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా సమావేశాల్లో వివరించిన కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లను ఆయన తప్పు పట్టారు. ‘‘ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్న వారు క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలను మాత్రమే వివరించాలి. లేకపోతే అది వంచనే అవుతుంది’’ అని పోస్టు పెట్టారు.





