
మానవునికి లాభం చేకూర్చే పక్షుల జాతిలో పిచ్చుకలు కూడా వుంటాయి. కానీ మారిన పరిస్థితుల కారణంగా పిచ్చుకలు ఇప్పుడు కనుమరుగు అవుతున్నాయి. చుట్టూ రేడియేషన్, సెల్ ఫోన్ల కారణంగా కనిపించకుండా పోతున్నాయి. దీని కోసం చాలా మంది పక్షి ప్రేమికులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఒడిశాలోని కొందరు వ్యక్తులు ఓ ప్రయోగం చేస్తున్నారు.
ఒడిశాలోని సంభల్ పూర్ లోని సామలేశ్వరీ దేవాలయం ప్రాంతంలో ఒకప్పుడు విపరీతమైన పిచ్చుకలు కనిపించేవి. రోజులో 24 గంటలూ ఆ దేవాలయం చుట్టూనే వుండేవి. సాయంత్రం కాగానే వాటి చప్పుళ్లకు చాలా మంది సేదతీరేవారు కూడా. అలాంటిది.. కొన్ని సంవత్సరాలుగా అవి కనిపించకుండా పోతున్నాయి. పిచ్చుక గూళ్లుకూడా మాయమవుతున్నాయి. ఈ సామలేశ్వరం దేవాలయం చుట్టూ ఎత్తైన భవంతులు వచ్చేశాయి. కానీ.. ఓ ప్రాజెక్టు కారణంగా ఆ దేవాలయం పరిసర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ఆ పక్షులు తిరిగి వెనక్కి రావడానికి మార్గం సుగుమమైంది.
సామలేశ్వరి ఆలయ ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు సంజయ్ బాబూ నేతృత్వంలో ఓ చొరవ ప్రారంభమైంది. తిరిగి పిచ్చుకలను స్వాగతించే వాతావరణాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలోని పక్షి గూళ్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోనే 10 మట్టి గూళ్లు ఏర్పాటయ్యాయి. అలాగే వాటి నీటి అవసరాలకు గాను వరి కంకులతో కూడిన వాటిని ఏర్పాటు చేసి, నీటి పాత్రలను వేలాడదీశారు.
అంతేకాకుండా పిచ్చుకలకు, పక్షులకు ఇబ్బందులు కాకుండా వుండేందుకు, జన సమూహాన్ని నివారించేందుకు ప్రధాన దేవాలయానికి కాస్త దూరంలోనే ఈ గూళ్లు ఏర్పాటు చేశారు. అయితే.. ఆలయ గోపురంపై నే వుంచడానికి ఏర్పాట్లు చేశారు మొదట్లో. కానీ… కొంత మంది నిపుణులు చెట్లపైనే వుంచమని సూచించడంతో అప్పట్లో ఆ ఏర్పాట్లు చేశారు. కేవలం గూళ్లు కట్టడమే కాకుండా వాటికి సరైన వాతావరణాన్ని కూడా వెతుకుతున్నారు.దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.
దేవాలయ పరిసర ప్రాంతాలను మార్పు చేస్తున్న సమయంలో కూడా పరిసర ప్రాంతాల్లోని చెట్లను ఏమాత్రం ముట్టుకోకూడదని నిర్ణయించుకున్నారు.దీంతో భారీగానే లాభం జరిగిందని నిర్వాహకులు అంటున్నారు. పిచ్చుకలు, రకరకాల పక్షులు ఆ చెట్ల దగ్గరే వుంటున్నాయని చెబుతున్నారు. పావురాలు, స్థానికంగా పిలుచుకునే కూకల్స్, కాజల్పతి వంటి పక్షులు బాగా వస్తున్నాయి. ఆ గూళ్లలో నివసిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాతే ఇవి తిరిగి కనిపిస్తున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ఆలయ బోర్డు అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ.. ‘‘నా చిన్న తనంలో ఆలయం దగ్గర పిచ్చుకలు గుంపులు గుంపులుగా వుండేవి. కానీ పట్టణీకరణ, కాంక్రీట్ నిర్మాణాల కారణంగా కాలం మారిపోయింది. అవీ కనిపించకుండా పోయాయి.ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో విస్తారంగా పచ్చదనం మరియు అనేక చెట్లు ఉన్నాయి, పిచ్చుకలను తిరిగి ఆహ్వానించాలని ఈ ప్రాజెక్టును చేస్తున్నా. చెట్టు పెంచాం. వున్న చెట్లని జాగ్రత్తగా కాపాడుతున్నాం. గూళ్లను ఏర్పాటు చేశాం. నీటి వసతి, ఆహారం కూడా ఏర్పాటు చేశాం. పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాం’’ అని హర్షం వ్యక్తం చేశారు.