ArticlesNews

హిందూ వేదజ్ఞానం

124views

హిందూ ధర్మానికి వేదం ప్రమాణం. రాసింది ఎవరో, ఎప్పుడో వివరాలు తెలియని వాంగ్మయం కాబట్టి వేదాన్ని అపౌరుషేయం అన్నారు. లిపి సౌకర్యం లేని కాలం; ఒకరు చెబితే మరొకరు విని, తిరిగి మననం చేసుకునే ప్రక్రియ మాత్రమే సమాచార మార్పిడికి సాధనం. శ్రుతులూ ఆ విధంగా తరం నుంచి తరానికి ‘స్మృతులు’గా ప్రసారమయ్యాయి. వేద సంఖ్యలో కొంత వివాదం ఉన్నా, ఇరవయ్యో శతాబ్దం ప్రారంభానికి ముండకోపనిషత్‌ వంటి సాధికారిక సాహిత్యం నిర్ధారణతో అవి చతుర్వేదాలుగా స్థిరపడ్డాయి. ఛందస్సు రూపంలో ఉండే ప్రార్థనలు- రుగ్వేదం; పద్య గద్య ప్రక్రియలో సాగే యజస్సుల సంగ్రహం -యజుర్వేదం; గాన సానుకూలత గలిగిన గేయప్రక్రియ- సామవేదం. కాగా వైజ్ఞానికాంశాల సమాహారంగా అథర్వణానికి వేదస్థాయి దక్కింది. ఇవిగాక ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం, ఆర్థికశాస్త్రం ఉపవేదాలుగా; సర్ప, పిశాచ, అసుర, ఇతిహాస వేదాలు పురాణాలతో కలిపి అయిదు వేదాంగాలుగా వైదిక వాంగ్మయం ఒక రూపం సంతరించుకుంది.

వేదాలలోని మంత్రభాగాలను ‘సంహితలు’ అంటారు. యజ్ఞయాగాదుల కర్మకాండ వివరణ భాగాలను ‘బ్రాహ్మణాలు’ అన్నారు. ఐతరేయం, తైత్తరీయం, గోపథం, శతపథం ఈ తరహా బ్రాహ్మణాలే. బ్రాహ్మణాలు ప్రస్తావించని కొన్ని విశేషాలు అరణ్యకాలు ప్రస్తావించాయి. జనావాసాలకు దూరంగా కర్మానుష్ఠానం చేసుకునే యోగుల కోసం అరణ్యకాల సృష్టి జరిగింది.

వేదవిజ్ఞానం అనంతమైంది. వేదాలన్నీ కంఠస్థమైనవాడు ఇప్పటి వరకు పుట్టలేదన్న విశ్వాసం ఒకటి ప్రచారంలో ఉంది. అధ్యయనానికి ఒక వ్యక్తి జీవితకాలం చాలదన్న ఒకనాటి వాదానికి ఈ సాంకేతిక యుగం చెల్లుచీటీ రాసేసింది. గురుశిష్య పరంపరగా సాగిన వైదిక జ్ఞానం మధ్య దశల్లో కొంతభాగం నష్టపోయింది. ఉచ్చారణా పరంగా శబ్దానికి ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అనే మూడు అవస్థలు ఉన్నాయి. పెంచి ఒక చోట, తగ్గించి ఒక చోట సాగించాల్సిన శబ్ద స్వరోచ్చరణ… జిహ్వపై చేసే కత్తిసామే. స్వరభేదానికి అర్థాన్ని, మంత్ర ప్రభావాన్ని మార్చే శక్తి ఉందని విశ్వసిస్తారు. ఒక అక్షరం పలికే సమయం కూడా లెక్కకు వచ్చే మాత్రాపద్ధతి వల్ల ఉదాత్త, అనుదాత్త, ఫ్లుత స్థానాల ఎరుక తప్పనిసరి. వేదోచ్చరణ తీరు వివరిస్తూ రాసిన ప్రాతిశాఖ్యం అందుకే వేదవాంగ్మయంలో ఒక ప్రముఖ గ్రంథం అయింది. ‘విద్‌’ అనే ధాతువు నుంచి వేదం పుట్టింది. ‘విద్‌’కు విద్వత్‌ అని అర్థం. ఆరోగ్యం ప్రసాదించమనో, సద్బుద్ధి కలిగించమనో, జ్ఞానం అందించమనో చేసుకునే వినతుల్లో ప్రార్థనలందుకుంటున్న దేవతలకు ఉండే విశేషార్థాల ప్రభావమే వేదానికి బలమన్నది డాక్టర్‌ సర్వేపల్లి వంటి విజ్ఞుల అభిప్రాయం. అరబిందో మహర్షి అన్నట్లు మానవకల్యాణం మనసులో ఉంచుకుని తరాల నుంచి తరాలకు ఈ వేద సంపదను అందిస్తున్న జ్ఞానవంతులకు మనం సర్వదా కృతజ్ఞతాబద్ధులమై ఉందాం.