
ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన భద్రతా బలగాలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించాయి. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్ మే 9, 10వ తేదీల్లో దాడులకు యత్నించింది. అయితే వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాయాది టార్గెట్ చేయాలని యత్నించిన వాటిలో ఆదంపుర్ వైమానిక స్థావరం కూడా ఒకటి. ‘‘ఈ ఉదయం నేను ఆదంపుర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లాను. అక్కడ మన పోరాటయోధులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచేవారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం. మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతిచర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారు’’ అని ఎక్స్ వేదికగా మోదీ రాసుకొచ్చారు. అలాగే వారితో దిగిన చిత్రాలను షేర్ చేశారు. అక్కడికి వెళ్లి పాక్ చేసిన తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించి భుజం తట్టారు. ఆపరేషన్ వివరాలను మోదీకి బలగాలు వివరించాయి. గంటన్నరకు పైగా ఆయన అక్కడే గడిపారు. ఆ సమయంలో ఆయన ధరించిన టోపీపై త్రిశూల్ చిత్రం కనిపించింది.
ఆపరేషన్ సిందూర్ గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మరుసటిరోజు మోదీ ఈ పర్యటన చేపట్టారు. నిన్న ప్రధాని మాట్లాడుతూ.. భారత్ ప్రళయభీకర దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. నవయుగ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండె పైనే కొట్టగలిగామన్నారు. ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు.
పహల్గాంలో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి.. కుటుంబసభ్యుల ముందే అమాయక ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర సౌధాలను కుప్పకూల్చి 100 మందికి పైగా పేరుమోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్లు ప్రకటించారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమేనని స్పష్టంచేశారు. భారతదేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఎంతపెద్ద నిర్ణయం తీసుకోడానికైనా వెనుకాడబోమని పాక్‌కు తేల్చిచెప్పారు.
పాక్ తప్పుడు ప్రచారానికి మోదీ చెక్..
ప్రధాని మోదీ షేర్ చేసిన చిత్రాల్లో చెక్కు చెదరకుండా ఉన్న ఎస్-400 రక్షణ వ్యవస్థ కనిపించింది. ఆదంపుర్‌లోని ఎస్-400 స్థావరాన్ని ధ్వంసం చేశామని పాక్ ప్రచారం చేసింది. భారత్‌లోని కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్తు.. సైబర్ వ్యవస్థలపై దాడి చేసి ధ్వంసం చేశామని చెప్పింది. ఇదంతా హేయమైన దుష్ప్రచారం అని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మోదీ దాయాది తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టారు. అలాగే భద్రతాబలగాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ పర్యటన ద్వారా గట్టి సందేశం ఇచ్చారు.





