
301views
ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్యే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్నారు. భారత సైన్యం పరాక్రమాన్ని ప్రదర్శించిందని, పాక్ సైనిక ప్రధాన కేంద్రమున్న రావల్పిండిలోనూ గర్జించిందన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన ఉగ్ర శక్తులకు భారత్ దీటుగా బదులిస్తుందన్నారు. ఈ ఆపరేషన్ ఉగ్రవాదంపై పోరులో దృఢ సంకల్పంతోపాటు మన సైనిక శక్తి సామర్థ్యాలను చాటిచెప్పిందన్నారు. పహల్గాం బాధితులకు న్యాయం చేకూరిందన్నారు. పాక్ ప్రజలపై భారత్ దాడి చేయలేదని, కానీ, దాయాది మాత్రం పౌరులే లక్ష్యంగా మన దేశంపై దాడులు చేసిందన్నారు.





