News

భారత్‌ చేసింది న్యాయం..! పాక్‌ వ్యక్తి ప్రశంసల జల్లు

185views

పహల్గాం ఘటనకు ప్రతిగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసింది. దీనిపై యావత్‌ దేశం హర్షం వ్యక్తం చేసింది. అయితే ఈ నేపథ్యంలో భారత్‌-పాక్‌ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తిస్థాయిలో ఇరు దేశాలు యుద్ధం దిశగా కదులుతున్నాయి. ఈ తరుణంలో నెట్టింట ఒక పాక్‌ వ్యక్తి భారత్‌ చేసింది న్యాయమే అంటూ పోస్ట్‌ చేసిన వైరల్‌ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అందులోనూ ఇలాంటి సమయంలో శత్రు దేశానికి చెందిన వ్యక్తే ఇలా మాట్లాడటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

ఆ వీడియోలో దుబాయ్‌కి చెందిన ఫారెక్స్ వ్యాపారి అభయ్ భారత్‌ సిందూర్‌ ఆపరేషన్‌తో పాక్‌పై చేసిన దాడిని సరైదని, అది న్యాయం అని మాట్లాడారు. అంతేగాదు భారత ప్రభుత్వం చర్యను, భారత సాయుధ దళాల ప్రతిస్పందనను మెచ్చకున్నాడు. ఇప్పుడు పాక్‌ వరకు వచ్చేటప్పటికీ తామూ బాధితులమే అని డ్రామా ప్లే చేస్తోందని ఆరోపించాడు. పహల్గాం పర్యటనకు వచ్చిన 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నప్పుడూ ఏమైంది ఇదంతా అని నిలదీశాడు.

ఇప్పుడు అకస్మాత్తుగా శాంతి, మానవహక్కులు అంటూ నీతి కబర్లు చెప్పడమే గాక పాక్‌ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది అని తిట్టిపోశాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా స్పందించే హక్కు భారత్‌కి పూర్తిగా ఉందన్నారు. అలాగే భారత్‌ చేసింది న్యాయమే అని ప్రశంసించాడు. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినప్పుడూ తెలియలేదా పాక్‌కి ఇది ఎప్పటికైనా నష్టమే అని అంటూ ఫైర్‌ అయ్యాడు.

ప్రజలు మరణించగానే శాంతి అనడం కాదు..భారత్‌ మొదటి నుంచి సంయమనం పాటిస్తూ..శాంతికి పీటవేస్తూ వచ్చిందనేది గుర్తులేదా అని మండిపడ్డారు. అంతేగాదు భారత్‌ చేసింది యుద్ధ చర్య కాదు..కేవలం అది న్యాయం.. అనినొక్కి చెప్పాడు అభయ్‌ వీడియోలో. పైగా ఆ వీడియోకి ఒక పాకిస్తానీ హిందువుగా నా అభిప్రాయం అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు సదరు పాక్‌ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.