
జీవితంలో సగభాగం నిద్రకు సరిపోతుంది. మిగిలిన సగంలోనే జ్ఞానసముపార్జన, దేహపోషణ నిర్వహించాలి. ఎవరైతే కాలం విలువ గ్రహించి సకాలంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ చేయాల్సిన పనులు నిర్వహిస్తారో వారే విజ్ఞులు. అందుకోసమే మన ధర్మగ్రంథాలు చతురాశ్రమాలను ఏర్పాటుచేశాయి. బ్రహ్మచర్యంలో విద్య, గృహస్థాశ్రమంలో సంసారజీవనం, వానప్రస్థంలో ముక్తి సాధించేందుకు కాశీప్రయాణం చేసేవారు. కాలానుగుణంగా జీవనధర్మాన్ని శ్రేయోదాయకంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వం ప్రయాణ సాధనాలు లేనందున కాశీకి వెళ్లటమే కానీ తిరిగిరావటం అరుదు. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కణ్ణించి అయినా కొన్ని గంటల్లోనే కాశీకి వెళ్లగలం. ఈ అవకాశాన్ని వినియోగించుకోగలిగితే ప్రశాంతత చేజిక్కుతుంది. సమాజంలో అనేక ప్రలోభాలకు బానిసలయ్యే ప్రమాదాన్ని అధిగమించగలుగుతాం.
అత్యంత పవిత్ర ప్రదేశంగా పురాణేతిహాసాలు అభివర్ణించిన కాశీని దర్శించుకుంటే ఆ విశ్వనాథుని మహిమ అవగతమవుతుంది. దైవాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న మధురానుభూతి కలుగుతుంది. నిర్విరామంగా ప్రజ్వరిల్లే మహాశ్మశాన మణికర్ణిక చితిమంటలు మనలో వైరాగ్య తరంగాన్ని రేకెత్తిస్తాయి. హరిశ్చంద్ర స్నానఘట్టంలో వచ్చే పాంచభౌతిక పార్థివ దేహాలు మనసులో అలజడి కలిగించటంతో పాటు మానవజన్మకు అర్థాన్నీ, పరమార్థాన్నీ బోధపరుస్తాయి. క్షణభంగురమైన ఈ దేహం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసిందే అనే సత్యం విశదమవుతుంది. పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ జన్మ ఒక గొప్ప అవకాశమనే భావన మదిలో నిలుస్తుంది. ‘పరోపకారం ఇదం శరీరం’ అనే పెద్దల మాట అక్షరసత్యమని స్పష్టమవుతుంది. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలతో సతమతమయ్యే మానవజీవితానికి ఆనందమార్గం అవగతమవుతుంది. దుర్లభమైన మనిషిజన్మకు పరోపకారమే పుణ్యప్రదం, పరపీడనం పాపం అని గ్రహించి అందుకు తగినట్టుగా ప్రవర్తిస్తారు. ఇలా కాశీ దర్శనంతో అడుగడుగునా జీవనసత్యాలు అనుభవంలోకి వస్తాయి. జన్మరాహిత్యం పొందటానికి కావలసిన పరిపూర్ణ జ్ఞానం వారణాశి యాత్రతో లభిస్తుంది. అందువల్ల ఎప్పుడో వృద్ధాప్యంలో వెళ్దాం అనుకోకుండా యువతీయువకులు కూడా కాశీ వెళ్లేందుకు ప్రయత్నించాలి. సకాల దర్శనం శ్రేయోదాయకం.