News

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ట్రాన్స్-మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ

399views

ఆంధ్రప్రదేశ్‌లో భారతదేశపు తొలి ట్రాన్స్‌-మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని (Trans Media Entertainment City) స్థాపించేందుకు ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా సంస్థలు ముంబయిలో జరిగిన వేవ్స్ సమ్మిట్-2025లో (Waves Summit 2025) సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. మే 1 నుంచి 4 వరకు ముంబయిలో నిర్వహితమైన వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్)-2025లో ఈ అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు జరిగాయని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.

ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో థీమ్ పార్క్‌లు, గేమింగ్ జోన్‌లు, గ్లోబల్ సినిమా కో-ప్రొడక్షన్ జోన్‌లు ఏర్పాటవుతాయని, ఇవి పర్యాటకులను ఆకర్షిస్తాయని మంత్రి తెలిపారు. అలాగే, ఈ ప్రాజెక్ట్ ఉద్యోగ సృష్టి, నైపుణ్య అభివృద్ధి, పర్యాటకం, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మంత్రి దుర్గేశ్ వియత్నాంలో ఉన్న సమయంలో, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట, క్రియేటివ్‌ల్యాండ్ స్టూడియోస్ వ్యవస్థాపకురాలు సాజన్ రాజ్ కురుప్, హాలీవుడ్ నుంచి డేవిడ్ ఉంగర్ (సీఈవో, ఆర్టిస్ట్స్ ఇంటర్నేషనల్), విలియం ఫైఫర్ (మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్‌గేట్), నికోలస్ గ్రానాటినో (చైర్మన్, నోవాక్వార్క్) ఈ MoUపై సంతకాలు చేశారు. ఇటీవల క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా ప్రతినిధులు వెలగపూడి సచివాలయంలో మంత్రితో చర్చలు జరిపి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ, క్రియేటివ్‌ల్యాండ్ ప్రాజెక్ట్ పర్యాటక రంగాన్ని ఆవిష్కరణలతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ వినోద సౌకర్యాలు, నైపుణ్య అభివృద్ధి, పర్యాటకం కలిసి స్థానిక ఆర్థిక వ్యవస్థను, ఉపాధి అవకాశాలను పెంచి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ సృజనాత్మక వేదికగా నిలుపుతుందని వివరించారు. ఈ ప్రాజెక్ట్ సమగ్ర వృద్ధికి ఒక బ్లూప్రింట్‌గా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.