
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి వెనక లష్కరే తోయిబా కుట్ర ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ దాడి తర్వాత నుంచి లష్కరే చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ ప్రభుత్వం అమాంతం భద్రత పెంచడమే ఇందుక్కారణం..! గతంతో పోలిస్తే అతడి భద్రతను నాలుగింతలు పెంచినట్లు తెలుస్తోంది. ఈమేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
లాహోర్‌లోని అత్యంత రద్దీగా ఉండే నివాస సముదాయాల నడుమ హఫీజ్ సయీద్ నివసిస్తున్నట్లు ఇటీవల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అతడి ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ, లష్కరే ముఠా నిరంతరం పహారా కాస్తున్నట్లు తాజా సమాచారం. దీంతోపాటు కాంపౌండ్ చుట్టూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా డ్రోన్లతో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక, హఫీజ్ ఇంటికి నలువైపులా 4 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చారట..!
లష్కరే చీఫ్ ఇంటి సమీపంలోకి సామాన్య పౌరులెవరినీ అనుమతించడం లేదని సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో ఆర్మీకి చెందినవి కాకుండా.. ఇతర డ్రోన్లపై నిషేధం విధించినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్-టీఆర్‌ఎఫ్’ ముష్కరులే అయినా.. దీనికి కర్త, కర్మ, క్రియ మాత్రం హఫీజ్ సయీదేనని భారత నిఘా వర్గాలు ఇప్పటికే అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరగొచ్చన్న అంచనాలతో లష్కరే చీఫ్‌కు పాక్ భద్రత పెంచడం గమనార్హం.
గతానికి భిన్నంగా.. జనావాసాల్లోనే
గతంలో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పాక్‌లో అబోట్టాబాద్‌లోని ఓ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు. అది జనావాసాలకు దూరంగా ఉండటంతో అమెరికా దాడులు చేసేందుకు సులువైంది. ఇక మసూద్ అజార్ వంటి ఉగ్రనేతలు కూడా బవహల్‌పూర్ పర్వతాల్లో దాక్కొని అక్కడినుంచే కార్యకలాపాలను సాగిస్తున్నారు. కానీ, వారికి భిన్నంగా హఫీజ్ సయీద్ జనావాసాల మధ్య ఉంటున్నాడు. దీంతో సామాన్య పౌరులకు నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో దాడులకు వెనకడుగు వేయొచ్చనేది పాక్ కుటిల యోచనగా తెలుస్తోంది.




