
( ఏప్రిల్ 30 – సింహాచల క్షేత్ర చందనోత్సవం )
హిరణ్యాక్షుణ్ణి సంహరించిన యజ్ఞవరాహమూర్తి, హిరణ్యకశిపుణ్ణి వధించిన నరసింహస్వామి కలసి వెలసిన క్షేత్రం సింహాచలం. ప్రహ్లాదుడు, చతుర్ముఖ బ్రహ్మ తదితరులతో కూడా పూజలందుకున్న ఈ వరాహనరసింహుడు భక్తుల పాలిట కొంగుబంగారం. స్థానికులు చెప్పే కథనాన్ని అనుసరించి.. సాక్షాత్తూ ప్రహ్లాదుడే సింహాచలంపై ఆ స్వామికి ఆలయం నిర్మించాడు. కాలక్రమంలో ఆ కోవెల శిథిలమైపోయి, వరాహనరసింహుడు పుట్టలోనే ఉండిపోయాడు. కొన్నాళ్లకు పురూరవ చక్రవర్తికి స్వామి కలలో కనిపించి ఆలయ నిర్మాణానికి ఆదేశించగా.. పుట్టను తొలగించి ఆలయాన్ని మళ్లీ నిర్మించారు. ‘శ్రీసింహాచల క్షేత్ర మాహాత్మ్యం’ ఈ విషయాలను పేర్కొంది. స్కంద పురాణంలోనూ సింహాచల వరాహ నరసింహుని ప్రస్తావన కనిపిస్తుంది. స్వామి ఆదేశం మేరకు ఆలయంలోని మూలవిరాట్టును చందనంతో కప్పి ఉంచే ఆచారం పురూరవుని కాలం నుంచే ఉందని తెలుస్తోంది. పుట్టను తొలగించే సందర్భంలో స్వామి నిజరూపం తెలియవచ్చింది. కానీ పాదాలు మాత్రం భూమిలోనే ఉండిపోయాయి. అందుకే ఈ క్షేత్రంలో పాద దర్శనం లేదు.
ఉగ్రమూర్తికి చందన లేపం
శ్రీసింహాచల నారసింహుడు ఉగ్రమూర్తి. ఆ ఆగ్రహరూపాన్ని శాంతింపజేయటానికే చందనపూత వేస్తారని క్షేత్రగాథ. దీనికి సంబంధించి ‘శ్రీసింహాచల క్షేత్ర మాహాత్మ్యం’లో ఓ దృష్టాంతం కనిపిస్తుంది. హిరణ్యకశిపుణ్ణి సంహరించాక నారసింహుని ఉగ్రరూపానికి సమస్త లోకాలూ కంపించి పోయాయి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ‘స్వామీ! నిన్ను శాంతరూపంలో దర్శించుకునే భాగ్యం ఎప్పుడు?’ అనడిగాడు. అప్పుడు నారసింహుడు ‘నేను లక్ష్మీదేవితో కలసి సింహాచలంపై వెలుస్తాను. శాంతరూపంలో ప్రహ్లాదుని పూజలందుకుంటాను’ అని తెలియజేశాడు. ఆ మాట ప్రకారం సింహాద్రి అప్పన్నగా స్వామి దర్శనమిస్తున్నాడు.
ఏడాదికో మారు ఉత్సవం
ఏడాదికోసారి విగ్రహం మీది చందనాన్ని తొలగించాలని నృసింహుడు పురూరవుణ్ణి ఆదేశించాడట. ఆ ఆచారం ప్రకారం ఏడాదిలో ఒకరోజు అక్షయతృతీయనాడు కొన్ని గంటల సేపు మూలమూర్తిపై చందనపు పూతను ఒలుస్తారు. భక్తులకు నిజరూప దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తారు. దీనినే ‘చందనోత్సవం’ అంటారు. ఈ స్వామిలో- ముఖం వరాహానిది, శరీరం నరునిది, తోక సింహానిది. సింహాచల క్షేత్రంలో తప్ప నరహరి మరెక్కడా వాలం(తోక)తో దర్శనమివ్వడు. స్వామి వరాహ నరసింహుడైనా, లక్ష్మీ నరసింహుడిగానే పూజలందుకుంటున్నాడు. లక్ష్మీదేవి ఆయన వక్షస్థల వాసి. మూల విరాట్టుకు ఇరువైపులా శ్రీదేవి, భూదేవి కొలువై ఉంటారు.





