News

చెత్త పనులన్నీ చేశాం.. ఉగ్రవాదులకు శిక్షణను అంగీకరించిన పాక్‌..

335views

తమ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్‌ కు గట్టి షాక్‌ తగిలింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు దాయాది నీచ బుద్ధిని బయటపెట్టాయి. అయితే, అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ ఆ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

పహల్గాం దాడి తర్వాత భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‘స్కై న్యూస్‌’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘‘ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాక్‌ చాలాకాలంగా చేస్తోంది? దీనిపై మీ స్పందన ఏంటీ?’’ అని జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి ఖవాజా బదులిస్తూ.. ‘‘అమెరికా, బ్రిటన్‌ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరబాటు అని అర్థమైంది. దానివల్ల పాక్‌ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉండేది’’ అని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో లష్కరే తోయిబా గురించి ప్రస్తావించారు. అది పాత పేరు అని, ఇప్పుడు తమ దేశంలో దాని ఉనికిలేదని అన్నారు.