
జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులనూ బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకూ ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయినీ తగ్గించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం దిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్)ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ పలు దేశాలు భారత్‌కు సంఘీభావం ప్రకటించాయి. ఉగ్రవాద నిర్మూలన కృషిలో అండగా నిలుస్తామని తెలిపాయి. మంగళవారం నాటి ఘటనలో మృతి చెందిన 26 మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ నుంచి పర్యాటకులు స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు.
కశ్మీర్‌కు వచ్చేందుకు హోటళ్లు, రైళ్లు, విమాన టికెట్లను రిజర్వు చేసుకున్న వాళ్లు వాటిని రద్దు చేస్తున్నారు. పహల్గాంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా…బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనగర్‌కు తరలించిన మృతదేహాలకు నివాళులర్పించారు
సీసీఎస్ నిర్ణయాలు
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడం, ఆ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి దిశగా నిలకడగా అడుగులేస్తుందన్న అక్కసుతోనే ఉగ్రదాడికి కుట్రపన్నారని సీసీఎస్ అభిప్రాయపడినట్లు సమావేశం అనంతరం విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు.





