
ఝార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. లాల్ పానియా ప్రాంతంలోని లుగూ హిల్స్ వద్ద కోబ్రా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ సహా 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే వివేక్ పేరిట రూ.కోటి రివార్డ్‌ను ప్రకటించినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని ఫుచన, నాగ మాంఝీ, కరన్, లెతర అనే పేర్లతో కూడా పిలుస్తారని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లో చనిపోయిన ఎనిమిది మందిలో అరవింద్, రామ్ మాంఝీ అనే మావోయిస్టులు ఉన్నట్లు వివరించారు. వీరిపై కూడా రూ.10 లక్షలు చొప్పున రివార్డులు ఉన్నాయని చెప్పారు.
ప్రశాంత్ హిల్స్ అతడి అడ్డా
కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రయాగ్ మాంఝీ, ధనాబాద్ జిల్లా తుండీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దల్‌బుద గ్రామంలో పుట్టాడు. ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో జరిగిన దాదాపు 100దాడుల్లో ఇతడి హస్తం ఉంది. ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా చేసుకుని తన కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఒక్క గిరిధి జిల్లాలోనే ఇతడిపై 50కేసులతో పాటు రూ.కోటి రివార్టు ప్రకటించారు. ఝార్ఖంఢ్‌లో అత్యధిక రివార్డ్ ఉన్న రెండో మావోయిస్టు ఇతడేనని పోలీసులు చెప్పారు. మాంఝీ కాకుండా మరో నలుగురి పైనే రూ.కోటి రివార్డులు ఉన్నాయని వివరించారు. ఇతడు పరస్నాథ్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పోలీసులు వేగులను అప్రమత్తం చేసి హతం చేశారు.
ఏడాది క్రితమే భార్య అరెస్ట్
ప్రయాగ్ మాంఝీ భార్య జయాను గత సంవత్సరం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలోనే చికిత్స తీసుకోవడానికి బయటకు రాగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ జయా మృతి చెందింది.
సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలోని లాల్‌పానియా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వీరికి లుగు హిల్స్ వద్ద మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి నక్సలైట్లు అడవుల్లోకి పారిపోయారు. అనంతరం మొత్తం 8 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, వీరిలో ప్రయాగ్ ఉన్నట్లు గుర్తించారు. తాజా ఆపరేషన్‌లో ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ వంటి భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 209 కోబ్లా బెటాలియన్, ఝార్ఖండ్ పోలీసులు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2025 చివరికి రాష్ట్రాన్ని మావో రహిత రాష్ర్టంగా చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇప్పటికే 244 మంది మావోయిస్టులను రాష్ట్రంలో అరెస్టు చేయగా, పలు దళాల కమాండర్లతో కలిపి 24 మంది లొంగిపోయారు.





