
వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పయనమవుతున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అక్కడ బస చేసే 14 రోజులు తీరికలేకుండా గడపనున్నారు. ఈ యాత్రలో ఆయన కనీసం ఏడు ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఇందులో.. పంటల సాగు, రోదసిలో నీటి ఎలుగుబంట్ల జీవనంపై పరిశోధనలు వంటివి ఉంటాయి.
యాక్సియమ్ మిషన్-4 (ఏఎక్స్-4)లో భాగంగా మే నెలలో శుక్లాతోపాటు అమెరికా, హంగరీ, పోలండ్‌లకు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు పయనమవుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో అమెరికా రోదసి సంస్థ-నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)ల భాగస్వామ్యంతో ఏడు ప్రయోగాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించనుంది.
ఐఎస్‌ఎస్‌లో నీటి ఎలుగుబంట్లు మనుగడ, పునరుత్పత్తి తీరుతెన్నులను ఇస్రో పరిశీలించనుంది. వీటి జన్యు వ్యక్తీకరణ పోకడల్లో వచ్చే మార్పులను విశ్లేషించనుంది. భూమిపై బయోటెక్నాలజీ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఇది వీలుకల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ చిన్న జీవులు పుడమిపై దాదాపు 60 కోట్ల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నో విపత్తులను తట్టుకొని ఈ జాతి నిలబడింది. భవిష్యత్‌లోనూ వాతావరణ మార్పులను ఇవి ఎదుర్కోగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రోదసిలో ఉండే భారరహిత స్థితిలో వ్యోమగాములు ఎలక్ట్రానిక్ డిస్ప్లేలను ఎలా నిర్వహిస్తారన్నదానిపై కూడా ప్రయోగం ఉంటుంది. తద్వారా అంతరిక్షంలో కంప్యూటర్ తెరల వినియోగం వల్ల శారీరక, విషయగ్రహణ సామర్థ్యం పరంగా పడే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఒక అంశంపైకి దృష్టిని కేంద్రీకరించడం, వేగంగా కంటిపాపను కదిలించడం వంటి అంశాలపై భారరహిత స్థితి చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దోహదపడుతుంది. ఈ మార్పులు.. వ్యోమగామి ఒత్తిడి స్థాయిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది కూడా తెలుసుకోవచ్చు. భవిష్యత్‌లో వ్యోమనౌకల్లో వాడే కంప్యూటర్ల డిజైన్, వ్యోమగాముల పనితీరులో చేయాల్సిన మార్పుల గురించి అవగాహన పెంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.
భారరహితస్థితి వల్ల మూడు రకాల మైక్రోఆల్గేల ఎదుగుదల, జీవక్రియలపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరో ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది. ఈ చిన్న జీవుల్లో ప్రొటీన్, లిపిడ్, ఇతర ప్రయోజనకర పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. సుదీర్ఘ అంతరిక్ష యాత్రల్లో వీటిని ఆహారంగా వ్యోమగాములు ఉపయోగించే అవకాశం ఉంది.
ఈఎస్‌ఏతో చేపట్టే మరో ప్రాజెక్టు కింద సయనోబ్యాక్టీరియాపై పరిశోధనలు సాగించనున్నారు. నీటిలో ఉండే ఈ జాతి సూక్ష్మజీవులకు కిరణజన్యసంయోగ క్రియ సామర్థ్యం ఉంది. సూక్ష్మగురుత్వాకర్షణ వాతావరణంలో వాటి వృద్ధి, కణ స్పందనలు, జీవరసాయన చర్యలను అర్థం చేసుకోవాలని ఇస్రో భావిస్తోంది. ఈ పరిశోధన.. మానవసహిత వ్యోమనౌకల్లోని పర్యావరణ నియంత్రణ వ్యవస్థల్లోకి ఈ బ్యాక్టీరియాను అనుసంధానం చేయడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. తద్వారా భవిష్యత్‌లో వ్యోమగాములకు మెరుగైన జీవన పరిస్థితులను సృష్టించొచ్చు.
జీవక్రియకు సంబంధించిన సప్లిమెంట్లు.. భారరహిత స్థితిలో కండరాల పునరుజ్జీవనానికి తోడ్పడతాయా అన్న అంశాన్ని శోధించేందుకు మరో ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది. దీనివల్ల వ్యోమగాముల్లో తలెత్తే కండరాల క్షీణత సమస్యను పరిష్కరించొచ్చని భావిస్తున్నారు. భూమిపై కండరాల సంబంధ రుగ్మతలకు కొత్త చికిత్సలను అభివృద్ధి చేసేందుకు కూడా వీలు కలుగుతుందని చెబుతున్నారు.
భారరహిత స్థితిలో విత్తనాలు మొలకెత్తడం, అనంతరం వాటి ఎదుగుదల తీరును శోధించేందుకు ‘స్ప్రౌటింగ్ సలాడ్ సీడ్స్ ఇన్ స్పేస్’ అనే ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది. తద్వారా రోదసిలోని పరిస్థితులు.. ఈ మొక్కల్లో జన్యువులు, సూక్ష్మజీవులు, పోషకాల విలువపై చూపే ప్రభావాన్ని శోధించనుంది. భవిష్యత్‌లో రోదసి అన్వేషకులకు విశ్వసనీయమైన ఆహార వనరును సమకూర్చడం దీని ఉద్దేశం.





