
రొంగలి బిహు వేడుకల సందర్భంగా అసోంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీభూమి జిల్లాలోని దత్తా అనే గ్రామంలోని భైరవ మందిరంలో గొడ్డుమాంసాన్ని విసిరేశారు. ఫక్రుద్దీన్ అనే వ్యక్తే ఈ పని చేసినట్లు గుర్తించి, పోలీసులు అరెస్ట్ చేశారు. మత సామరస్యాన్ని, వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఇలాంటి ఘాతుకాలకు ఒడిగడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
ఈ నెల 15 వ తేదీన ఈ ఘటన జరిగింది. పవిత్రమైన భైరవుడి దేవాలయ ఆవరణలో గొడ్డు మాంసం ముక్కలు ముక్కలుగా పడి వుండటాన్ని భక్తులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు దేవాలయానొకి చేరుకొని, ప్రాథమిక విచారణ చేయగా.. ఫక్రుద్దీన్ అనే ముస్లిమే ఈ పని చేసినట్లు గుర్తించారు. మిగతా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు.
ఈ ఘటనపై స్థానిక హిందువులు స్పందించారు. ఈ ఘటన తమను ఎంతో బాధించిందని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్నారు. మరోవైపు ఈ ఘటన తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఇక… అందరూ శాంతియుతంగా వుండాలని, నిందితుడ్ని అరెస్ట్ చేశామని, తదుపరి దర్యాప్తు కూడా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
నిజానికి అసోంలో గొడ్డు మాంసంపై నిషేధం నడుస్తోంది. నిబంధనల ప్రకారం రెస్టారెంట్లు, హోటళ్లు, సభలు, మతపరమైన ప్రదేశాలలో గొడ్డు మాంసం అమ్మకూడదు, వడ్డించకూడదు.మతపరమైన ఉద్రిక్తతలను నివారించడానికి ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో దీనిని కఠినంగా కూడా అమలు చేస్తోంది. అయినా దేవాలయ ప్రాంగణంలో గొడ్డు మాంసాన్ని విసిరేశారు.





