ArticlesNews

ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం

413views

అతి ప్రాచీన, చారిత్రక ఆలయాలకు కొలువైన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. భక్తుల విశ్వాసాలు, స్థానిక ఆచార సంప్రదాయాల తో ముడిపడి దశాబ్దాలుగా పూజలందుకుంటూ ఆ ప్రాంతానికే ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఆ కోవకు చెందినదే ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలోని ‘ధనరాజుల తులసమ్మ’ ఆలయం. ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా, భక్తుల కొంగు బంగారంగా, వరాలిచ్చే అమ్మవారిగా పిలవబడే ఈ ఆలయం అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. తలుపులు లేకపోవడంతో పాటు 24 గంటలు, 365 రోజులు భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుంది. అనునిత్యం అమ్మవారు ప్రజల్ని కనిపెట్టుకుని ఉంటారని, అందుకే ఇక్కడ ఎలాంటి తలుపులు, తాళాలు ఉండవని భక్తుల విశ్వాసం. ఆంధ్రా ఒడిశా ప్రాంతాలకు వెళ్లే సరిహద్దు ఇచ్ఛాపురం – బరంపురం – ఒడిశా జరడా మూడు రోడ్ల కూడలిలో బాహుదానదికి సమీపంలో అమ్మవారు నిత్య పూజలు అందుకుంటున్నారు.

కోర్కెలు తీర్చే కొంగు బంగారం..
ఒకప్పుడు కొచ్చెర్ల వంశీయులు మాత్రమే అక్కడ పూజలు చేసేవారు. రానురాను గ్రామస్తులు సైతం పూజలు చేయడం ప్రారంభించడంతో పాటు చిన్నపాటి ఉత్సవాలు నిర్వహించేవారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో అటువైపుగా రాకపోకలు సాగించే లారీ, బస్సు డ్రైవర్లు కొబ్బరి కాయలు కొట్టి పసుపు, కుంకుమ బొట్టును తమ వాహనాలకు పెట్టేవారు. ఇలా మొదలైన పూజలు సంబరాలుగా మారిపోయాయి. ఆంధ్రాతో పాటు ఒడిశా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరుతున్నారు. ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా కొలుస్తూ భక్తులు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ సంబరాలు నిర్వహిస్తున్నారు.

అంబరాన్నంటే సంబరం..
ఆలయానికి వచ్చే కానుకలతో ఏటా ఏప్రిల్‌ రెండో ఆదివారం భారీ ఎత్తున సంబరం చేస్తుంటారు. ఆంధ్రా, ఒడిశాతో పాటు కోల్‌కతా, భువనేశ్వర్‌, విశాఖపట్నం, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఉత్సవంలో పాల్గొంటూ బోనాలు సమర్పిస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించే ఈ సంబరం అంబరాన్ని తాకుతుంది.