
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి.. రోడ్లను దిగ్భందించారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై వారు రాళ్లతో దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. దీంతో 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు. హింసాత్మక చర్యలు నెలకొంటున్న నేపథ్యంలో ముర్షిదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించామని.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వదంతులను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఘర్షణ సమయంలో ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో గాయపడిన 10మంది పోలీసులు.. ఓ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
వక్ఫ్ చట్టం ఈనెల 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలుచేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. మైనారిటీలు, వారి ఆస్తులను రక్షిస్తానని హామీ ఇచ్చారు. ఒకప్పుడు బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశం కలిసి ఉండేవని.. తర్వాతే విభజన జరిగిందని గుర్తుచేశారు. ఇక్కడే ఉండిపోయిన మైనారిటీలకు రక్షణ కల్పించడం మన బాధ్యత అని.. తాను ఉన్నంతకాలం వారిని, వారి ఆస్తులను రక్షిస్తానని అన్నారు.
పరిస్థితిని అదుపుచేయడంలో మమత ప్రభుత్వం విఫలం: భాజపా
పరిస్థితిని అదుపు చేయడంలో మమత ప్రభుత్వం విఫలమయ్యిందని భాజపా విమర్శలు గుప్పించింది. దీనిని అదుపులోకి తీసుకురావడానికి అవసరమయితే కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించింది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని.. సమాజంలోని ఇతర వర్గాలలో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నాలని మండిపడింది.





