
ముంబై ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి తహవూర్ రాణాను భారత్ కి తీసుకురావడంపై ముంబై దాడుల్లో బాధితురాలు, ఉగ్రవాది కసబ్ ను గుర్తించడంలో సాక్షిగా వున్న దేవికా రోటావన్ స్పందించింది. రాణాను అమెరికా నుంచి తీసుకురావడం భారత ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమని హర్షం వ్యక్త చేశారు. రాణాను భారత్ కి తీసుకొచ్చినందుకు అమెరికా, భారత్ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు.
రాణా నుంచి అనేక కీలక వివరాలు రాబట్టవచ్చొని, పాక్ లో ఇప్పటికీ దాగి వున్న ఇస్లామిక్ ఉగ్రవాదులను పెంచి పోషించే వారి పేర్లు కూడా బయటకు రావొచ్చని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ సర్కార్ కృషి చేస్తోందని, పాక్ లో దాగి వున్న ఉగ్రవాదులతో పాటు ప్రపంచంలో ఎక్కడ వున్నా సరే.. ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని శిక్షించాలని ప్రధాని మోదీని కోరారు.
అలాగే కబస్ మాదిరిగా వున్న ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేయాలని కూడా దేవికా అన్నారు. పాక్ లో వున్న దావూద్, హఫీజ్ సయీద్ ఇతర కీలక సూత్రధారులను భారత్ కి తీసుకొచ్చి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ముంబై దాడుల బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.





