
వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కోల్ కత్తా లోని ముర్షిదాబాద్ లో భారీ హింస చెలరేగింది. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ నిరసనకారులు హింసాత్మక ఆందోళనలు చేపట్టారు. రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. ముర్షిదాబాద్ ప్రాంతంలోని జంగీపూర్ లో ఈ హింస చోటు చేసుకుంది.
వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ భారీ సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల వాహనాలకు కూడా నిప్పంటించారు.దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. అయితే ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసి మరీ, నిరసన వ్యక్తం చేయాలని నిరసనకారలు ప్రయత్నించగా.. పోలీసులు దానిని అడ్డుకున్నారు.
చాలా కొద్ది సమయంలోనే ఈ ఆందోళన హింసాత్మకంగా మారినట్లు తెలుస్తోంది. నిరసన కాస్తా హింసగా మారడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జ్ చేశారు. అలాగే టియర్ గ్యాస్ కూడా ఉపయోగించారు. అయితే ఈ ఘర్షణలో పోలీసులతో పాటు కొంత మంది గాయపడ్డారు.
తీవ్రంగా మండిపడ్డ బీజేపీ
మరోవైపు ముర్షీదాబాద్ లో పరిస్థితి హింసాత్మకంగా మారడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. మమతా బెనర్జీ సారథ్యంలో హింసను అదుపు చేయడానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారని అమిత్ మాలవీయ విమర్శించారు. మమతా బెనర్జీ మాట్లాడే మాటల వల్లే ఇంత హింస జరుగుతోందని మండిపడ్డారు. సమాచారం పొక్కకుండా వుండేందుకు ఇంటర్నెట్ పై కూడా నిషేధం విధించారని ఆరోపించారు.





