News

సుప్రీమ్ తీర్పును అందరం గౌరవిద్దాం – ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు

830views

భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంచాలని ముస్లింలకు సూచించండి అని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సీనియర్ సభ్యుడు మౌలానా ఖాలీద్ రషీద్ ఫిరంగి మహలీ శుక్రవారం ఇమామ్‌లకు పిలుపునిచ్చారు. అయోధ్యలోని వివాదస్పద కట్టడంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో వౌలానా ఖాలీద్ రషీద్ ఈ మేరకు ఇమామ్‌లకు చెప్పారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. కాబట్టి ఈ లోగా జస్టిస్ గొగోయ్ అయోధ్య అంశంపై తీర్పు ఇవ్వనున్నారని అందరూ ఆశిస్తున్నారు. జస్టిస్ గొగోయ్ పదవీ విరమణ చేసే లోగా తీర్పు వెల్లడించనున్నారని మీడియాలో వస్తున్న కథనాలను ఈ సందర్భంగా వౌలానా ఖాలీద్ రషీద్ ఉటంకిస్తూ దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత అయోధ్య అంశం అతి పెద్దదని, చాలా సున్నితమైందని పేర్కొన్నారు. అయోధ్యలోని కట్టడంపై ఎటువంటి తీర్పు రాబోతున్నదని యావత్ దేశం, ప్రపంచ సమాజం ఎదురు చూస్తున్నదని ఆయన తెలిపారు. కోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరారు. ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పాల్సిందిగా ఆయన ఇమామ్‌లకు సూచించారు. తీర్పు ఎలా ఉన్నా అందరూ గౌరవించాలని ఆయన కోరారు. తీర్పు అనుకూలంగా వస్తే సంతోషంతో ఉత్సవాలు జరుపుకోరాదని, వ్యతిరేకంగా వస్తే నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని ఆయన ముస్లింలకు సూచించారు. హిందు-ముస్లింలు గంగా-జమున తరహాలో కలిసి ఉండాలని, మత సామరస్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం సున్నితమైన అయోధ్య అంశంపై 40 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ గత నెల 16న ముగిసిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.