
తమ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఘోరంగా విఫలమయ్యారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కశ్మీర్ సమస్యని బూచిగా చూపెట్టి పబ్బం గడపాలనుకున్నారు. కానీ, ఆ దేశ ప్రజలు తాజాగా జరిగిన ఓ సర్వేలో తగిన తీర్పు చెప్పారు. కశ్మీర్ అసలు సమస్య కాదని..విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, దేశ ఆర్థిక వ్యవస్థే తమని తీవ్రంగా కలచివేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ‘గాలప్ ఇంటర్నేషనల్’ సంస్థ పాకిస్థాన్‌లో నిర్వహించిన సర్వే అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టింది. పాక్‌లో 53శాతం మంది ప్రజలు.. ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నట్లు సర్వే తేల్చింది. 23శాతం మంది ప్రజలు నిరుద్యోగాన్ని, 4శాతం మంది ప్రజలు అవినీతిని, మరో 4శాతం మంది ప్రజలు నీటి కొరతను సమస్యగా భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. రాజకీయ అస్థిరత, డెంగీ విజృంభణపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కశ్మీర్‌ని కేవలం 8శాతం మంది ప్రజలు మాత్రమే సమస్యగా భావిస్తున్నారని సర్వే కుండబద్దలు కొట్టింది. కశ్మీర్‌ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తి రాద్ధాంతం చేస్తున్న ఇమ్రాన్ ప్రభుత్వానికి కేవలం 8శాతం మంది ప్రజలు మాత్రమే మద్దతుగా నిలవడం ఇమ్రాన్‌కు చెంపపెట్టేనని చెప్పాలి.
పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఆ దేశ పరిస్థితి అత్యంత దారుణ స్థితికి చేరుకుందని.. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గత జులైలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) హెచ్చరించింది. అప్పటికి పాక్ ఖజానాలో కేవలం 8బిలియన్ డాలర్ల నిధులే ఉండడం గమనార్హం. అంటే అవి కేవలం 1.7 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ 6బిలియన్ డాలర్ల బెయిల్ ఔట్ ప్యాకేజీతో పాక్‌కు అండగా నిలిచింది. అలాగే చైనా, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ సైతం పాక్ సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సాయానికి ముందుకు వచ్చాయి.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.