
వైయస్సార్ కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, దక్షిణకాశీగా పేరొందిన పుష్పగిరి ఆలయం సమీపంలోని పెన్నానది, పక్కనున్న రాళ్లలో పురాతన విగ్రహాలు వెలుగుచూశాయి. ఇక్కడ పార్వతీదేవి, నంది, సూర్యుని రాతి విగ్రహాలు, శివలింగ పానవట్టం తదితర వాటిని కొందరు భక్తులు గుర్తించి స్థానిక ఇంటాక్ సభ్యుడు రాఘవేంద్రవర్మకు తెలియజేశారు. ఆయన వైవీయూ లలిత కళల విభాగం ప్రొఫెసర్ కోట మృత్యంజయరావు దృష్టికి తీసుకెళ్లి విగ్రహాలను పరిశీలించారు. ఇవి పురాతన విగ్రహాలని చెప్పారు. ఈ విషయాన్ని ఆర్కియాలజీ విభాగం రీజనల్ అధికారి మునిరత్నం నాయుడు దృష్టికి తీసుకెళ్లగా విగ్రహాలను పరిశీలించి స్థానిక అధికారులకు చెప్పి భద్రపరిచే ఏర్పాట్లు చేస్తామన్నారు.
శ్రీ పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సట్టి భారవి మాట్లాడుతూ, పుష్పగిరి నదీ తీర ప్రాంతంలో ఉన్న చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తున్న సందర్భంలో నదీలో ఒక “నంది విగ్రహం,అమ్మ వారి విగ్రహం” సాక్షాత్కరించాయని చెప్పారు.పంచ నదీ తీరాన్ని శుభ్రం చేస్తుండగా విగ్రహాలు బయటపడడం సంతోషదాయకమన్నారు.





