ArticlesNews

భవానీదేవి పూజకు విశిష్టమైన రోజు

257views

( ఏప్రిల్‌ 5 – భవానీ అష్టమి )

చైత్ర శుక్ల అష్టమిని భవాని అష్టమి, అశోకాష్టమి అంటారు. పార్వతీదేవికి మరో పేరే భవాని. అమ్మవారిని సేవించుకోవడానికి ఇది విశిష్టమైన రోజు. దక్షుని కుమార్తె సతీదేవి పరమేశ్వరుని వివాహమాడింది. ఒకసారి దక్షుడు యజ్ఞం చేస్తూ అందరినీ ఆహ్వానించి సతీదేవిని, శివుణ్ణి పిలవలేదు. కానీ సతీదేవి యజ్ఞానికి వెళ్లాలనుకుంది. శివుడు వద్దని నచ్చజెప్పినా పుట్టింటిపై మమకారంతో వెళ్లింది. యజ్ఞానికి వచ్చిన సతీదేవిని దక్షుడు అవమానించాడు. శివుడు కోపిష్టి, శ్మశానవాసి, కపాలాన్ని ధరించి తిరుగుతాడంటూ హేళన చేశాడు. దాంతో మనస్తాపం చెందిన సతీదేవి యాగాగ్నిలో దూకి తనువు చాలించింది. విషయం తెలిసిన శివుడు ఆవేశపడి తన జటాజూటంలోని ఒక జటను పెరికి కొండపైకి విసిరాడు. అందులోంచి వీరభద్రుడు జనించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.

మరణించిన సతీదేవి మరుజన్మలో పర్వతరాజు హిమవంతుడు, మేనక దంపతులకు పార్వతిగా జన్మించింది. ఆ పార్వతీదేవే భవాని కాబట్టి ఆమె జన్మించిన చైత్రమాసంలో శుక్లపక్ష అష్టమినాడు అమ్మ వారిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ ప్రత్యేక దినాన అశోకవృక్షం కింద శివపార్వతుల చిత్రపటం లేదా విగ్రహాలను ఉంచి ఆ చెట్టును, ఆదిదంపతులను పూజిస్తారు. ఇలా ఆరాధించటం వల్ల సకల పాపాలూ హరించి, అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని, దుఃఖాలు తొలగుతాయని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.