
బెంగళూరు వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయప్రతినిధి సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ హోసబళే విలేకరులతో మాట్లాడుతూ.. సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శాంతి, శ్రేయస్సుతో పాటు సామరస్యపూర్వకమైన, వ్యవస్థీకృత హిందూ సమాజాన్ని నిర్మించాలని సంకల్పించామని తెలిపారు. ఐకమత్యం, సార్వజనీన శ్రేయస్సును సాధించాలన్న లక్ష్యంతో హిందూ సమాజం చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదురైనా… సాధువులు, సంతులు, మహానుభావులు, మహనీయుల ఆశీస్సులు, వారి కృషితో ముందుకే సాగుతోందన్నారు.
దేశంలో కాలక్రమేణా పాతుకుపోయిన బలహీనతలను నిర్మూలించి, భారత్ ను పరమ వైభవ స్థితికి తీసుకురావడానికి 1925 లో డాక్టర్ హెడ్గేవార్ ఆరెస్సెస్ ను ప్రారంభించారని పునరుద్ఘాటించారు. దీని తర్వాత సంఘ కార్యానికి బీజాలు వేస్తూ.. దైనందిన శాఖ రూపంలో ఓ ప్రత్యేక కార్యపద్ధతిని తీసుకొచ్చి, వ్యక్తి నిర్మాణాన్ని చేశారన్నారు. శాశ్వతంగా వుండే సంప్రదాయ విలువలు, నీతికి అనుగుణంగా దేశాన్ని పునర్నిర్మించడానికి నిస్వార్థమైన తపస్సులాగా కొనసాగుతూనే వుందన్నారు.
అయితే.. డాక్టర్జీ జీవిత కాలంలోనే సంఘ్ దేశ వ్యాప్తంగా వ్యాపించిందని, అయితే.. సనాతన ధర్మం అన్న వెలుగులో వివిధ రంగాల్లో కాలానుగుణంగా గోళ్వాల్కర్ వ్యవస్థలను నిర్మాణం చేశారన్నారు. ఈ వంద సంవత్సరాల సంఘ ప్రయాణంలో దైనందిన శాఖలు, విలువలతో సంఘ్ సమాజం యొక్క అచంచలమైన ప్రేమ,విశ్వాసాన్ని, ప్రేమను సంపాదించుకుందని దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు. అలాగే స్వయంసేవకులు గౌరవాలు, అవమానాలు, ఇష్టాయిష్టాలకు అతీతంగా సమాజానికి ప్రేమ, ఆప్యాయత అన్న బలంతో అందర్నీ కలుపుకుపోతున్నారని తెలిపారు.
సంఘ శతాబ్ది సంవత్సరం సందర్భంగా సమాజంలోని పూజ్య సాధు సంతులను, సజ్జన శక్తిని గుర్తుంచుకోవడం తమ కర్తవ్యమని, వారి ఆశీర్వాదాలు, సహకారాలు గొప్ప బలాన్ని అందిస్తున్నాయని అన్నారు. భారత్ గొప్ప సంప్రదాయాలతో కూడిన పురాతన సంస్కృతి అని, ఈ అనుభవాల ఆధారంగా సామరస్య పూర్వకమైన సమాజాన్నినిర్మించడానికి ఆ పునాదులు, అనుభవ జ్ఞానం ఉపయోగపడుతుందన్నారు.
ధర్మాచరణ ద్వారా వచ్చే ఆత్మ విశ్వాసం, వ్యవస్ధీకృతమైన, సామూహిక జీవనం ఆధారంగానే హిందూ సమాజం తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలదన్న సూత్రాన్ని సంఘ్ విశ్వసిస్తుందని తెలిపారు. అందుకే అన్ని రకాల వివక్షలను రూపుమాపి, పర్యావరణ అనుకూల జీవన శైలి అన్న మూలాలపై, విలువలతో కూడిన కుటుంబాలను ప్రోత్సహించే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలని సంకల్పించామని, అలాగే పౌర విధులను నిర్వర్తించే, సామరస్యపూర్వక పద్ధతులను అనుసరించే సమాజాన్ని కూడా నిర్మించాలని సంకల్పించుకున్నామని తెలిపారు. ఇలాంటి సమాజమే అన్ని సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తుందన్నారు.




