News

కశ్మీర్‌లో ఇప్పుడు సినిమాహాళ్లు నిండుతున్నాయి: అమిత్‌షా

308views

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అనుసరిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. కశ్మీర్‌లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, అక్కడి యువకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. సినిమాహాళ్లు నిండుతున్నాయని వెల్లడించారు. రాజ్యసభలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల పనితీరుపై మండిపడ్డారు. అవి ఉగ్రవాదుల పట్ల మెతకవైఖరి అనుసరించాయని దుయ్యబట్టారు.

‘‘జమ్మూకశ్మీర్‌, ఈశాన్య భారతంలోని ఉగ్రవాదం, తీవ్రవాదం దేశ వృద్ధికి ఆటంకాలు. వాటి వల్ల 92వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మోదీ ప్రభుత్వ పాలనలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం వల్ల మరణాలు 70 శాతం తగ్గాయి. ఉగ్రఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’ అనే రాజ్యాంగ నిర్మాతల కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చింది. ఇప్పుడు కశ్మీర్‌లో సాయంత్రం పూట కూడా సినిమాహాళ్లు తెరిచే ఉంటున్నాయి. జీ20 సమావేశాలు జరిగాయి. 2019 నుంచి 2024 వరకు అక్కడి యువతకు 40వేల ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య, పెట్టుబడులు పెరిగాయి’’

‘‘ఉరి, పుల్వామా ఘటనలు జరిగిన రోజుల వ్యవధిలో మెరుపు దాడులు, వైమానిక దాడులు చేసిన ఈ ప్రభుత్వం పాకిస్థాన్‌కు గట్టి బదులిచ్చింది. అలాగే మార్చి 31, 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం అంతమవుతుంది. రాజకీయ భావజాలం మద్దతున్న ఉగ్రవాదాన్ని విస్తరించకుండా అడ్డుకుంటాం. అలాగే రూ.1.25 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేశాం’’ అని కేంద్రహోంశాఖ పనితీరుపై చర్చ సందర్భంగా అమిత్‌ షా వెల్లడించారు.