News

పరశురాముడికి, ఔరంగజేబుకి పోలిక.. కాంగ్రెస్ నేతపై కేసు

480views

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు రేఖ జైన్ పరశురాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భగవాన్ పరశురాముడ్ని ఔరంగజేబుతో పోల్చారు. దీంతో అన్ని వర్గాల వారు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రేఖా జైన్ పై వ్యాఖ్యలు చేయడంతో ివారీ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకురాలిపై భారతీయ న్యాయ సంహిత ప్రకారం 196, 299,302 సెక్షన్లతో పాటు 66ఏ సెక్షన్ ప్రకారం కూడా కేసులు నమోదయ్యాయి.

ఈ నెల 12 న రేఖా జైన్ ఫేస్ బుక్ మాధ్యమంగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో పరశురాముడ్ని ఔరంగజేబుతో పోల్చుతూ రాసుకొచ్చారు.ఔరంగజేబు తన సోదరుడి తలను నరికి, తండ్రికి సమర్పించాడని, పరశురాముడు కూడా తన తల్లి తలను నరికేశాడని పేర్కొన్నారు. ఔరంగజేబు క్రూరుడు. ఆయన్ను ఎవ్వరూ ఆదర్శంగా తీసుకోరు. ముస్లింలు కూడా తమ పిల్లలకు ఔరంగజేబు అని పేరు పెట్టరు. కానీ.. హిందువులు మాత్రం పరశురాముడికి ఏకంగా దేవాలయాలు నిర్మిస్తారు.’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆమె ఈ పోస్టును తొలగించారు. అయినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే.. అన్న మాటలన్నీ అనేసి… ఆ తర్వాత సహజంగా క్షమాపణలు అంటూ రేఖా జైన్ పేర్కొన్నారు.

దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందూ దేవుళ్లను, సాధు సంతులను అవమానించడం కాంగ్రెస్ కి రివాజు అయిపోయిందని, వారికి అలవాటంటూ విరుచుకుపడింది. దేవుళ్లను అవమానించడాన్ని సహించమని మంత్రి విశ్వాస్ సారంగ్ అన్నారు. ఆమె క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఒరిగిందేమీ లేదని, ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సస్పెండ్ చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని తేలిపోయినట్లేనని అన్నారు.

అయితే.. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. ఇది ఆమె వ్యక్తిగత మనో భావన అని పేర్కొంది. ఆమెనే దీనికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ తెలిపింది. ఇది కాంగ్రెస్ ఆలోచనా విధానం కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే రామకిశోర్ డోగ్నే తెలిపారు.