
తిరుమల కొండకి ఆనుకొని వున్న దేవలోక్, ముంతాజ్, ఎంఆర్కేఆర్ హోటల్స్ కి ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏడు కొండలను ఆనుకొని ఎవరూ వ్యాపారం చేయడానికి గానీ, అపవిత్రం చేయడానికి గానీ వీల్లేదన్నారు. వేంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడానికి టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనువడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబీకులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నవితరణ కేంద్రంలో భోజనం వడ్డించారు.
ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. దేశంలో, ప్రపంచంలో వేంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడడానికి తాము కంకణం కట్టుకున్నామని, టీటీడీలో పనిచేసే వారు హిందువులే అయి వుండాలన్నారు. ఇతర మతస్తులకు మరోచోట అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. క్రిస్టియన్, ముస్లిం ఆలయాల్లో కూడా ఇతర మతస్థులు వుండరన్నారు. ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే వుంటారన్నారు. ప్రపంచ దేశాల్లో హిందువులు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో వేంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని ప్రకటించారు.
ముంతాజ్ హోటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం మంజూరు చేసిన భూములను వెనక్కి తీసుకోవాలని సాధు సంతులు చాలా రోజులుగా తిరుమలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముంతాజ్ హోటల్ కి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీ సాధుసంతు పరిషత్ తో పాటు ధార్మిక సంఘాలు, హిందూ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల పరిపాలన భవనం ముందు శ్రీనివాసానంద స్వామీజీ ఆమరణ దీక్షకు కూడా దిగారు. సనాతన ధర్మ పరిరక్షణ అంటే పవిత్రమైన స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతించడమా… తిరుమల ప్రక్షాళన అంటే అపవిత్రం చేయడమా…అంటూ సాధువులు మండిపడ్డారు.
ఇక.. చాలా గ్రామాల్లో వేంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవని, ఆయా గ్రామాల్లో స్వామి వారి ఆలయాల నిర్మాణ కోసం నిధుల సేకరణ కోసం ట్రస్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ట్రస్టుకు వచ్చే నిధులను పకడ్బందీగా ఖర్చు చేస్తామని, స్వామి వారి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా అవి తిరిగి స్వామికే చెందేలా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.